July 21, 2026

తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
Reading Time: 2 minutes
Tgtet 2026 Notification Released Telangana In Service Teachers Tet Application Dates Exam Schedule And Eligibility Are

TGTET 2026: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (TGTET-In-service Teachers-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సర్వీసులో కొనసాగడానికి లేదా తదుపరి ప్రమోషన్లు పొందడానికి టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సాధారణంగా ఏడాదికి నిర్వహించే రెండు టెట్‌లతో పాటు ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్‌లు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించింది.

ఈ పరీక్షకు ప్రభుత్వ, లోకల్ బాడీ, TGREIS, సంక్షేమ నివాస పాఠశాలలు, మోడల్ స్కూల్స్ ఇంకా ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్-సర్వీస్ టీచర్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, ఈ పరీక్షలో సాధించిన అర్హత భవిష్యత్తులో వచ్చే ప్రత్యక్ష నియామకాలకు (Direct Recruitment/DSC) చెల్లదని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఈ టెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో (CBT) మొత్తం రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1 నుండి 5 తరగతులకు బోధించే SGTలు & LFL హెచ్‌ఎంలు పేపర్-I రాయవలసి ఉండగా.. 6 నుండి 8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లు, TGTలు, లాంగ్వేజ్ పండిట్లు, హైస్కూల్ హెచ్‌ఎంలు పేపర్-II పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో ప్రతి పేపర్ 150 మార్కులకు 150 బహుళ ఐచ్ఛిక ప్రశ్నల (MCQs) రూపంలో ఉంటుంది. అయితే ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. జనరల్, BC కేటగిరీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750/-, రెండు పేపర్లకు రూ.1000/- రుసుము నిర్ణయించగా.. SC/ST/PwD అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.700/-, రెండు పేపర్లకు రూ.950/- గా నిర్ణయించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి జనరల్/EWS అభ్యర్థులకు 60% అంతకంటే ఎక్కువ, BC అభ్యర్థులకు 50% అంతకంటే ఎక్కువ, SC/ST/వికలాంగ అభ్యర్థులకు 40% అంతకంటే ఎక్కువ మార్కులు రావలసి ఉంటుంది.

అర్హత కలిగిన ఉపాధ్యాయులు 2026 జులై 22 నుండి జులై 29 వరకు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2026 ఆగస్టు 31 నుండి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు సెప్టెంబర్ 07 నుండి సెప్టెంబర్ 11 వరకు రోజుకు రెండు విడతల్లో (ఉదయం 9.00 నుండి 11.30 వరకు, మధ్యాహ్నం 2.00 నుండి 4.30 వరకు) నిర్వహిస్తారు. 2026 సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 మధ్య ప్రకటిస్తారు. దరఖాస్తు సమయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి విద్యాశాఖ హెల్ప్‌డెస్క్ ఫోన్ నంబర్లు (7093958881, 7093468882, 7032901383) అందుబాటులో ఉంచింది.