కరోనా రిటర్న్స్.. ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య.. ఆ జిల్లాలోనే 8 మందికి పాజిటివ్..

ఏపీలో పెరుగుతున్న కొవిడ్ కేసులు కలవర పెడుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత కరోనా మహమ్మారి కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలోనే 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి చొప్పున కరోనా కేసులు నమోదుకాగా.. విశాఖ, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు కోలుకుని డిశ్చార్జి కాగా.. హోం ఐసోలేషన్లో నలుగురు ఉన్నారు. తాజా కేసులకు కారణం ‘ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5’ వేరియంట్‌గా గుర్తించారు. 25 రోజుల్లో కరోనా సోకిన బాధితుల్లో నలుగురు మృతి చెందారు. అయితే.. వారంతా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో 8 మందికి చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
‘ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5’ వేరియంట్‌తో కరోనా కేసులు పెరగుతుండటంతో.. అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువ ఉన్నా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
కరోనా ఒమిక్రాన్ RF 5 వేరియంట్ లక్షణాలు
కరోనా ఒమిక్రాన్ RF 5 వేరియంట్ లక్షణాలు సాధరణంగానే ఉంటాయని.. పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట RF 5 లక్షణాలుగా తెలిపారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో RF 5 కేసులు వెలుగు చూస్తున్నాయని.. RF 5 వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా పరిస్థితులు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున అధికారిక ఆరోగ్య శాఖ సూచనలను మాత్రమే అనుసరించడం మంచిది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటే అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలి. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ వినియోగం, చేతుల పరిశుభ్రత, రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..