రాబోయే రోజుల్లో వర్షాలు కురవడం కష్టం.. ఆయిల్ పామ్ పై మరింత ప్రచారం చేయండి: మంత్రి వివేక్

రాబోయే రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడం కష్టంగా మారే ప్రమాదం ఉందని మంత్రి వివేక్ అన్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని, రైతులు సాంప్రదాయ పంటలకు భిన్నంగా ప్రత్యామ్నాయ పంటల (ఆల్టర్నేటివ్ పంటలు) వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లాలో ఎల్ నినో పరిస్థితులపై అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి వివేక్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పర్యావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమైందన్నారు. ముఖ్యంగా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగు గురించి రైతుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు.
ఆయిల్ పామ్ తోటల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి రైతుకూ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సాంప్రదాయ కళారూపాలు అయిన వీధినాటకాల ద్వారా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల సాగుపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి వివేక్ అధికారులను ఆదేశించారు.