July 21, 2026

ఆదుకోని అల్పపీడనం ..ఈ నెలంతా ఇదే పరిస్థితి ఉండొచ్చన్న ఆందోళనలు

ఆదుకోని అల్పపీడనం ..ఈ నెలంతా ఇదే పరిస్థితి ఉండొచ్చన్న ఆందోళనలు
Reading Time: 2 minutes

ఆదుకోని అల్పపీడనం ..ఈ నెలంతా ఇదే పరిస్థితి ఉండొచ్చన్న ఆందోళనలు

Caption of Image.
  • మూడు రోజులు వర్షాలుంటాయన్న ఐఎండీ.. కానీ నిరాశే
  • పెద్ద వానలు ఒక్క రోజు మురిపెమే.. అదీ వరంగల్, ములుగు జిల్లాల్లోనే
  • ద్రోణి ప్రభావమంతా ఉత్తరాదివైపు ఉండడమే కారణం
  • ఈ నెలంతా ఇదే పరిస్థితి ఉండొచ్చన్న ఆందోళనలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు మొఖం చాటేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో పరిస్థితి కొంతైనా అనుకూలంగా మారుతుందని భావించినా.. అలాంటిదేమి కనిపించడం లేదు. పెద్ద వానలేవీ పడటంలేదు. అల్పపీడనం ఏర్పడిన రోజు రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పింది. కానీ, ఆ ఒక్క రోజు తప్ప మళ్లీ పెద్ద వాన అన్నదే లేదు. అది కూడా ఒక్క వరంగల్, ములుగు జిల్లాలకే పరిమితమైంది. మిగతా రాష్ట్రమంతా మోస్తరు వానలు పడి.. ఆశలు రేకెత్తించినా చివరకు మిగిలింది మాత్రం నిరాశే. అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావమంతా ఉత్తర భారతం, మధ్య భారతంలోనే ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనే ఎక్కువ వర్షాలు పడ్డాయంటున్నారు.

ఇటు ఒడిశా, బెంగాల్‌‌‌‌పైనా అల్పపీడనం ప్రభావం ఉందని చెబుతున్నారు. అదేసమయంలో దక్షిణాదిలో మబ్బులు కమ్మినా.. సరైన వెదర్ సిస్టమ్స్​ లేకపోవడం వల్ల వర్షాలు పడలేదని చెబుతున్నారు. గాలులు ఎక్కువగా వీస్తున్నా.. రుతుపవనాలను వర్షంగా మలిచేందుకు అనువైన వాతావరణం లేకుండా పోయిందని అంటున్నారు. ఫలితంగా ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడు మహారాష్ట్ర, గుజరాత్‌‌‌‌లో 60 నుంచి 80 సెంటిమీటర్ల వరకు సగటు వర్షం పడినా.. మన దగ్గర మాత్రం అది కేవలం 6 నుంచి 8 సెంటిమీటర్లే ఉందని పేర్కొంటున్నారు. దానికి కారణం ద్రోణి మొత్తం ఉత్తరాదివైపే కేంద్రీకృతమై ఉండటమేనని చెబుతున్నారు.  

ఈ నెలంతా ఇంతేనా?

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ నెలంతా కూడా ఎలాంటి మార్పులు ఉండవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలోగానీ, అటు అరేబియా సముద్రంలోగానీ వర్షాలకు అనువైన వాతావరణ పరిస్థితులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని మూడు రోజుల క్రితం విడుదల చేసిన వీక్లీ అవుట్​లుక్‌‌‌‌లో భారత వాతావరణ కేంద్రం వెల్లడించడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వారంలో రాష్ట్రంలో వర్షపాతలోటు 94 శాతంగా ఉండడం పరిస్థితికి అద్దం పడుతున్నది. 

వచ్చే రెండు వారాలు కూడా వర్షాలు ఎక్కువగా పడవని ఐఎండీ పేర్కొంది. ఆ సంస్థ విడుదల చేసిన మ్యాపులూ ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 23 వరకు తెలంగాణ ముదురు ఆరెంజ్ అలర్ట్‌‌లో ఉండగా.. 23 నుంచి 30 వరకు ఎల్లో అలర్ట్‌‌లో ఉన్నది. అంటే ఈ రెండు వారాలు కూడా వర్షాల లోటే ఉంటుందని ఐఎండీ డేటాతో వెల్లడైంది. అదేసమయంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉన్నట్టు తేలింది.  

పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మబ్బులు పడుతున్నా.. వర్షాలు మాత్రం పెద్దగా పడడం లేదు. ఆదివారం మాత్రం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. నల్గొండ, నాగర్​కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, మహబూబ్​నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షం పడింది. అత్యధికంగా నల్గొండ జిల్లా కట్టంగూరులో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌‌పూర్‌‌‌‌లో 4.3 సెంటీమీటర్లు, జోగుళాంబ గద్వాల జిల్లా సాటర్లలో 4, కుమ్రంభీం జిల్లా గోలేటి టౌన్​షిప్‌‌లో 3.9, వనపర్తి జిల్లా ఎల్గొండలో 3.9, నల్గొండ జిల్లా నార్కట్‌‌పల్లిలో 3.9, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 3.6, సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లిలో 3.5, వికారాబాద్ జిల్లా ధారూరులో 3.1, మెదక్​ జిల్లా నర్సాపూర్‌‌‌‌లో 3.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే, వచ్చే నాలుగైదు రోజులపాటు గాలులు వీస్తాయని, వర్షాలు ఉండవని ఐఎండీ వెల్లడించింది.  
 

©️ VIL Media Pvt Ltd.