Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!

దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (Private Universities) వ్యవహారశైలిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ యూనివర్సిటీల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలేమిటి, అక్కడ కల్పిస్తున్న విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై నిశితమైన నిఘా సారించింది. ‘అయేషా జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు విచారణ సందర్భంగా వచ్చిన పలు ఫిర్యాదులను పరిశీలించిన సుప్రీంకోర్టు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ వర్సిటీల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశిస్తూ, పూర్తి వివరాలతో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఉన్నత స్థాయి కమిటీతో విస్తృత తనిఖీలు
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ (CCE) అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) కార్యదర్శి కన్వీనర్‌గా, జేఎన్‌టీయూ (JNTU) రిజిస్ట్రార్ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా, పాలమూరు వర్సిటీ రిజిస్ట్రార్, ఉస్మానియా వర్సిటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. అవసరమైతే విషయ నిపుణులను కూడా నియమించుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించగా, ఈ బృందం ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ వర్సిటీని సందర్శించి నిశితంగా పరిశీలిస్తోంది.
ఆ 9 అంశాలపై సుప్రీంకోర్టు నిఘా
ఈ ఉన్నత స్థాయి కమిటీ ప్రధానంగా సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన తొమ్మిది కీలక అంశాల ఆధారంగానే దాడులు, పరిశీలనలు జరుపుతోంది. ఇందులో భాగంగా అసలు ఈ విశ్వవిద్యాలయాల స్థాపన ఉద్దేశం ఏమిటి, వీటికి ప్రభుత్వం ఏమైనా భూములు లేదా మినహాయింపులు కేటాయించిందా, దీని మేనేజ్‌మెంట్ కమిటీలో ఉన్న యాజమాన్య సభ్యుల సముచిత వివరాలేమిటి అనే కోణంలో తనిఖీలు సాగుతున్నాయి. అలాగే విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ, ప్రవేశ పరీక్షల విధానం చట్టబద్ధంగా ఉందా అని పరిశీలించడంతో పాటు, బోధనా సిబ్బంది నియామకాలు , వారి విద్యార్హతలు యూజీసీ (UGC) నిబంధనలకు లోబడే ఉన్నాయా అనే అంశాలను అధికారులు నిశితంగా క్షేత్రస్థాయిలో ధ్రువీకరిస్తున్నారు.
నిధుల మళ్లింపు, వేతనాలపై ఆడిట్
మరోవైపు ప్రభుత్వం ఈ వర్సిటీల పర్యవేక్షణకు క్రమం తప్పకుండా ఇన్‌స్పెక్షన్లు చేస్తోందా, ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా ‘లాభాపేక్ష లేని’ ప్రాతిపదికన నడుస్తామని ప్రకటించుకున్న ఈ సంస్థలు, నిజంగానే ఆ నిబంధనలకు కట్టుబడి ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి అకౌంట్లను ఆడిట్ చేస్తున్నారు. వర్సిటీల నిధులను నిర్వాహకులు తమ సొంత కుటుంబ సభ్యుల ఆస్తుల కొనుగోళ్లకు మళ్లించలేదని నిరూపించేలా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు బోధనా సిబ్బందికి యూజీసీ ప్రకారం కనీస వేతనాలు అందుతున్నాయా, విద్యార్థులు , సిబ్బంది సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీలు పని చేస్తున్నాయా అనే అంశాలపై సేకరించిన పూర్తి సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమగ్ర అఫిడవిట్ సమర్పించనుంది.