Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?

దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. నిన్నటి నుంచి రాజధాని ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇక మంగళవారం అనూహ్యంగా రాహుల్ గాంధీ ఉద్యమాన్ని పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లారు. ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. దాదాపు మూడున్నర గంటలు ఆందోళన చేపట్టారు. అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా తరలిస్తున్న క్రమంలో ముక్కుకు గాయమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడుదల చేసిన వీడియోలు, ఫొటోల్లో రాహుల్ గాంధీ రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతుండగా పోలీసులు ఆయనను లేపి అక్కడి నుంచి తీసుకెళ్తున్నట్లు కనిపించింది. మరో ఫొటోలో రాహుల్ గాంధీ ముక్కు దగ్గర రక్తస్రావం జరిగినట్లు కనిపిస్తున్న దృశ్యాలను కూడా కాంగ్రెస్ షేర్ చేసింది. పోలీసులు తరలిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ప్రజాస్వామ్యం ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు.’’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రియాంక గాంధీ వాద్రా కూడా పోలీసు బస్సులోకి ఎక్కేందుకు నిరాకరించినట్లు వీడియోల్లో కనిపించింది. అనంతరం పోలీసులు ఆమెను బలవంతంగా బస్సులోకి ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం నీట్ అంశంపై సీజేపీ చేపట్టిన నిరసనలో గాయపడిన విద్యార్థులను మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలతో కలిసి ప్రధాని మోడీ నివాసం వైపు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. అయితే భద్రతా కారణాలు చూపిన ఢిల్లీ పోలీసులు నిరసనకారులను అడ్డుకుని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు.
నీట్-యూజీ పరీక్షలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాలని, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై బాధ్యులను జవాబుదారీ చేయాలని కోరుతోంది. నిరసన కొనసాగుతున్న సమయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. జితేంద్ర సింగ్ ప్రకారం.. మొదట పార్లమెంట్‌లో నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే నిరసన విరమిస్తానని రాహుల్ గాంధీ చెప్పారని.. ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మరో డిమాండ్ ముందుంచారని ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదనలను కాంగ్రెస్ ఖండించింది. విద్యార్థులకు న్యాయం చేయడం, వారిపై జరిగిన పోలీసు చర్యపై బాధ్యత వహించాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టామని, పార్లమెంట్‌లో సమస్యపై అర్థవంతమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని కాంగ్రెస్ ఆరోపించింది.