Food: రసీలా బూందీ..బకర్ వాడి వెరైటీ స్నాక్స్.. పిల్లలు క్షణాల్లో ఖాళీ చేస్తారు..!

పిల్లలు బడి నుంచి ఇంటికి రావడంతోనే అమ్మా ఏమన్నా తింటానికి ఏమన్నా పెట్టు అంటారు. రోజూ ఒకే రకమైన స్నాక్స్ అంటే ఇసుగు వస్తుంది. అమ్మా.. రోజూ ఈ వెరైటీలేనా అంటారు. అలాంటప్పుడు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఏదైనా యాక్టివిటీ చేయాలి అనుకుంటారు. అలాగే వారికి కొత్త రుచులను తినిపించాలనుకుంటారు. అలాంటి వారు రసీలా బూందీ .. బకర్ వాడి అనే వెరైటీస్నాక్స్ ట్రై చేయవచ్చు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .!
రసీలా బూందీ తయారీకి కావాల్సినవి
- శెనగపిండి – ఒక కప్పు
- చక్కెర-రెండు కప్పులు
- నూనె – వేగించడానికి సరిపడా
- రోజా వాటర్ – పావు టీ స్పూన్
రసీలా బూందీ తయారీ విధానం
శెనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి బూందీ పిండిలా కలపాలి. పాన్ లో నూనె వేడిచేయాలి. దానిమీద బూందీ జల్లీ పెట్టి, పైన శెనగపిండి మిశ్రమం పోసి రుద్దాలి. జల్లీ నుంచి పిండి జారి, నూనెలో పడుతుంది. బూందీని వేగించి, తీసి పక్కన పెట్టాలి. చక్కెరలో రెండు కప్పుల నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. గులాబ్ జామూన్ కోసం ఎలా పంచదార పాకం చేసుకుంటామో అలాగే దీన్నీ తయారు చేసుకోవాలి. ఈ పంచదార పాకంలో రోజ్ వాటర్ కలపాలి. చివరిగా పంచదార పాకంలో వేగించిన బూందీ వేసి కలిపితే యమ్మీయమ్మీ రసీలా బూందీ రెడీ.
బకర్ వాడి తయారీకి కావాల్సినవి
- గోధుమపిండి – ఒక కప్పు
- శెనగపిండి- ముప్పావు కప్పు
- పసుపు- ఒక టీ స్పూన్
- కారం – ఒక టేబుల్ స్పూన్
- నూనె – వేగించడానికి సరిపడా
- గసగసాల, నువ్వులు- ఒక్కోటి పావుకప్పు చొప్పున
- వేగించిన కొబ్బరి తురుము – అర కప్పు
- అల్లం తరుగు – ఒక టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్
- ధనియా, జీలకర్ర పొడి – ఒక్కోటి అరటేబుల్ స్పూన్ చొప్పున
- ఇంగువ – పావు టీ స్పూన్
- కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
- నిమ్మరసం- రెండు టీ స్పూన్లు
- ఉప్పు – సరిపడా
బకర్ వాడి తయారీ విధానం
గోధుమపిండి, శెనగపిండి,కారం, పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె, చిటికెడు ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. అరగంట సేపు ఆ మిశ్రమాన్ని పక్కనుంచాలి. ఆ లోపు పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి గసగసాలు, నువ్వులు, కొబ్బరి తురుము వేసి నిమిషం ఉంచి దింపాలి. వేడిచల్లారాక పొడిపొడిగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీయాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం తరుగు, ధనియాలపొడి, జీలకర్ర పొడి, మిగిలిన కారం, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఇంగువ వేసి బాగా కలపాలి. చపాతీ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని మందపాటి చపాతీల్లా వత్తి దానిపై నువ్వుల మిశ్రమం పరిచి రోల్ లా చుట్టాలి. అంచుల్ని తడిచేత్తో అతికించి చక్రాల్లా కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేయాలి.