July 21, 2026

IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?

IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
Reading Time: 2 minutes
Ind Vs Zim T20 Series 2026 Full Schedule Match Timings India Squad And Live Details

IND vs ZIM: ఐర్లాండ్ తో 2-0, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో ఘోర పరాజయం పాలైన భారత జట్టు ఇప్పుడు ఆ నిరాశను పక్కనపెట్టి కొత్త సవాల్‌కు సిద్ధమైంది. యువ ఆటగాళ్లతో ఉన్న టీమిండియా జట్టు జింబాబ్వే పర్యటనకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుండగా.. ఎలాగైనా సరే ఈ సిరీస్‌ను గెలిచి విజయాల బాట పట్టాలని భారత్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

సిరీస్ ప్రారంభం:

భారత్, జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జూలై 23న జరగనుంది. రెండో మ్యాచ్ జూలై 25న, మూడో & చివరి టీ20 జూలై 26న జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లూ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతాయి.

కోచ్ మార్పు:

ఈ పర్యటనకు భారత జట్టు రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో ఉండడు. ఆయన స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. భారత కెప్టెన్‌గా తన తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవాలని అయ్యర్ ఇంకా ఎదురు చూస్తున్నాడు.

గత సిరీస్‌ లాగే వైభవ్ సూర్యవంశిపై అందరి చూపు మరోసారి నిలవనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన వైభవ్‌కు ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పుడు జింబాబ్వేపై మంచి ప్రదర్శన చేసి జట్టులో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటాడో లేదో తెలియాలి.

మ్యాచ్ టైమింగ్స్:

సాధారణంగా టీమిండియా టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంటాయి. అయితే ఈ సిరీస్‌లో మ్యాచ్‌ల సమయం భిన్నంగా ఉంటుంది. మూడు టీ20 మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలు కానున్నాయి. భారత జింబాబ్వే పర్యటనను “జీ యునైట్8 స్పోర్ట్స్” నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంకా ప్రత్యక్ష ప్రసారం ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్ (C), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (W), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (W), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.