సీజేపీ నిరసనలపై తొలిసారి స్పందించిన కేంద్రం.. ఆందోళన విరమించాలని రిక్వెస్ట్

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై కేంద్ర ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ధర్నా విరమించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో సహకరించాలని ఆందోళనకారులను కోరింది. కాగా, నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 20న చలో పార్లమెంట్ కార్యక్రమానికి క్రాకోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.
సీజేపీ పిలుపు మేరకు యువత పెద్ద ఎత్తున చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజేపీ పార్లమెంట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. సోనమ్ వాంగ్ చుక్ వెంటనే విడుదల చేయాలని, నీట్ ఎగ్జామ్ లీకులకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని, నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన లేఖను మంత్రికి అందజేశారు.
సీజేపీ ప్రతినిధులతో భేటీ విషయాన్ని మంత్రి జేపీ నడ్డా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. సీజేపీ ప్రతినిధులతో సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని ఆయన తెలిపారు. తమ డిమాండ్ల కూడిన వినతిపత్రాన్ని సీజేపీ ప్రతినిధులు అందజేశారని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని వారు కోరారని తెలిపారు. నిరసనకారులందరూ తమ ధర్నాను విరమించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో పరిపాలనా యంత్రాంగానికి సహకరించాలని నేను వారిని కోరారని నడ్డా వెల్లడించారు. మరీ నడ్డా కోరిక మేరకు సీజేపీ కార్యకర్తలు ఆందోళన విరమిస్తారా లేదా అన్నది చూడాలి.