డీఎస్పీ యూనిఫామ్‌లో మహ్మద్ సిరాజ్..డీజీపీ సీవీ ఆనంద్‌తో భేటీ

టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. డీఎస్పీ (DSP) హోదా దక్కిన తర్వాత సిరాజ్ మొదటిసారి పోలీసు యూనిఫామ్ ధరించి డీజీపీ కార్యాలయానికి వెళ్లడం విశేషం. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌కు సిరాజ్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ప్రత్యేక భేటీకి సంబంధించిన ఫొటోలను సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోగా, అవి నెట్టింట వైరల్‌గా మారాయి. క్రికెట్ మైదానంలోనే కాకుండా పోలీసు సేవల్లోనూ సిరాజ్ తన ముద్ర వేయబోతున్నారు.
2023 ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ కేవలం 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. 2024 కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 15 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చారు.
2024, 2026 ఐసీసీ మెన్స్ టి20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న భారత జట్టులో సిరాజ్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన సాధించిన అసాధారణ క్రీడా విజయాలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయనకు గ్రూప్-1 కేటగిరీ కింద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గౌరవ పదవిని కేటాయించింది.