అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్య భేటీ .. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా..?

న్యూఢిల్లీ: నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ క్రాకోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన పార్లమెంట్ ముట్టడి వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ప్రధాన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ అనూహ్య భేటీకి సంబంధించిన అజెండా ఏంటీ.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఏ అంశాలపై చర్చించారనే దానిపై మాత్రం సమాచారం లేదు.
అయితే, సీజేపీ ఆందోళన వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సీజేపీ ఆందోళనలకు తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తారని.. ఈ అంశంపై చర్చించేందుకు ఆయన అమిత్ షాతో భేటీ అయినట్లు మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ కార్యాలయం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా, నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 20న చలో పార్లమెంట్ కార్యక్రమానికి క్రాకోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. సీజేపీ పిలుపు మేరకు యువత పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకుని చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీజేపీ పార్లమెంట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అనుమతి లేదని సీజేపీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ యువత వెనక్కి తగ్గకుండా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించింది.
ALSO READ : పార్లమెంట్ వీధుల్లో రణరంగం.. పోలీసుల లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం..
సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు పార్లమెంట్ గేట్స్ క్లోజ్ చేసి సీజేపీ సపోర్టర్స్ ను అదుపులోకి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్లమెంట్ బయట ఫైర్ బ్రిగేడ్లతో భారీగా పోలీసులను మోహరించారు. పార్లమెంట్ బయట సీజేపీ.. లోపల ప్రతిపక్షాల నిరసనలతో సోమవారం (జులై 20) దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది.