July 20, 2026

ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు..సెగ్మెంట్లలోనే ఉండాలి..నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్

ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు  రావొద్దు..సెగ్మెంట్లలోనే ఉండాలి..నేతలకు  సీఎం రేవంత్  వార్నింగ్
Reading Time: < 1 minute

ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు..సెగ్మెంట్లలోనే ఉండాలి..నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్

Caption of Image.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి  సీరియస్  వార్నింగ్ ఇచ్చారు. జులై 19న శనివారం నిర్వహించిన ప్రత్యేక జూమ్ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడిన సీఎం.. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో.. అప్పటి వరకు కాంగ్రెస్ నేతలెవరూ గాంధీభవన్‌కు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని.. కేవలం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

హైదరాబాద్‌కే పరిమితమైతే కుదరదని.. నేతలంతా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఐఆర్ పనుల్లో నిర్లక్ష్యం వహించే ఇన్‌చార్జ్‌లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం బీఎల్‌ఓ (BLO) రిపోర్టులపైనే ఆధారపడకుండా.. బీఎల్‌ఏ (BLA) రిపోర్టులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాబోయే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో యుద్ధప్రతిపాదికన పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జులై 30వ తేదీన ఈ పనుల పురోగతిపై పూర్తిస్థాయి సమీక్ష ఉంటుందని, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ మొత్తం ప్రక్రియను ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో కలిసి సమన్వయం చేయాల్సిన బాధ్యతను మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు రేవంత్ రెడ్డి అప్పగించారు. ఎస్‌ఐఆర్‌పై ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న సీఎం.. కష్టపడి పనిచేసే వారికి అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో అత్యుత్తమంగా పనిచేసిన టాప్ 100 బీఎల్‌ఏలకు.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో నేరుగా భేటీ అయ్యే అవకాశాన్ని కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.