July 21, 2026

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ!

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ!
Reading Time: < 1 minute
TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యూలైన్ ప్రసాదం పింణీలో సరికొత్త టెక్నాలజీ!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన, వేగవంతమైన సౌకర్యాలు కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

సాధారణ రోజులతో పాటు రద్దీ సమయాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉంటారు. ప్రస్తుతం ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న క్యూలైన్లలో ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. సుమారు 100 మంది శ్రీవారి సేవకులు ప్రతిరోజూ పాలు, మజ్జిగ, నీళ్లతో పాటు ఉప్మా, పులిహోర, సాంబారన్నం, టమోటా రైస్ వంటి పదార్థాలను లక్ష పోర్షన్ల మేర భక్తులకు అందజేస్తున్నారు.

45వ గేటు వద్ద ప్రయోగం

అయితే యంత్రాల సాయంతో ప్రసాద వితరణ సులభతరం చేసేందుకు దాతల సహాయంతో ఈ ‘మూవింగ్ డైనింగ్’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం శిలాతోరణం సమీపంలోని 45వ గేటు వద్ద ఈ ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ పనితీరును టీటీడీ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. శ్రీవారి సేవకులు ఈ కన్వేయర్ యంత్ర సహాయంతో భక్తులకు సులువుగా ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.

విజయవంతమైతే మరిన్ని ప్రాంతాల్లో అమలు

దాదాపు రూ. 3.50 లక్షల ఖర్చుతో తయారుచేసిన ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ ట్రయల్ రన్ విజయవంతమైతే, క్యూలైన్లలోని మిగిలిన కీలక ప్రాంతాల్లో కూడా మరిన్ని ఫుడ్ సర్వింగ్ కన్వేయర్లను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఆలోచిస్తోంది. యంత్రాల వినియోగం ద్వారా భక్తులకు శ్రమ లేకుండా, వేగంగా ఆహార పదార్థాలు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,