July 21, 2026

ఇంటెల్ ఉద్యోగులకు మరో షాక్.. డేటా సెంటర్ విభాగంలో లేఆఫ్స్

ఇంటెల్ ఉద్యోగులకు మరో షాక్.. డేటా సెంటర్ విభాగంలో లేఆఫ్స్
Reading Time: < 1 minute

ఇంటెల్ ఉద్యోగులకు మరో షాక్.. డేటా సెంటర్ విభాగంలో లేఆఫ్స్

Caption of Image.

ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈసారి కంపెనీ డేటా సెంటర్ గ్రూప్ (DCG)లో పనిచేస్తున్న ఉద్యోగులకు లేఆఫ్స్‌పై సమాచారం ఇచ్చింది. కంపెనీ వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటెల్ వెల్లడించింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారనే విషయాన్ని మాత్రం కంపెనీ బయటపెట్టలేదు.

గత రెండేళ్లుగా ఖర్చులు తగ్గించడం, సంస్థాగత మార్పులు చేపట్టడం వంటి చర్యలతో ఇంటెల్ భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గిస్తోంది. 2023 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో సుమారు లక్షా 25వేల మంది ఉద్యోగులు ఉండగా.. 2025 చివరి నాటికి ఆ సంఖ్య 85 వేలకు పడిపోయింది. అంటే కేవలం రెండేళ్లలోనే దాదాపు 40 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయి.

డేటా సెంటర్ విభాగంపైనే తాజా ప్రభావం..
డేటా సెంటర్ గ్రూప్ సంస్థలకు అవసరమైన సర్వర్ ప్రాసెసర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తుంది. ఈ విభాగాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు సంస్థలో అవసరమైన నైపుణ్యాలు, పాత్రలను పునర్వ్యవస్థీకరిస్తున్నామని ఇంటెల్ తెలిపింది. దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ఈ మార్పులు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఒరెగాన్‌లోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గింది..
ఇంటెల్‌కు అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం ప్రధాన తయారీ, పరిశోధన కేంద్రంగా ఉంది. 2024 ప్రారంభంలో అక్కడ సుమారు 23 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఏడాది తర్వాత ఆ సంఖ్య 20వేల 200కు తగ్గింది. అనంతరం 2025లో మరో 3వేల 200 ఉద్యోగాలను తొలగించింది. ప్రస్తుతం అక్కడ ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో కంపెనీ వెల్లడించలేదు. అయినప్పటికీ ఒరెగాన్‌లో అతిపెద్ద ప్రైవేట్ యజమానిగా ఇంటెల్ కొనసాగుతోంది.

పోటీని తట్టుకునేందుకే మార్పులు..
సెమీకండక్టర్ రంగంలో పెరుగుతున్న పోటీ, వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా సంస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ రీస్ట్రక్చరింగ్ చేపడుతున్నట్లు ఇంటెల్ స్పష్టం చేసింది. తాజా లేఆఫ్స్ ఎప్పుడు అమల్లోకి వస్తాయి, ఏయే టీమ్స్ దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే కంపెనీ వర్క్‌ఫోర్స్ మార్పులు ఇంకా కొనసాగనున్నాయని ఈ పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.