CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!

ఢిల్లీలో సోమవారం జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన 20 ఏళ్ల విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆమెను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (RML) ఆస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారం ఢిల్లీలో హాట్‌టాఫిక్‌గా మారింది. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నెలకొంది. బాధిత విద్యార్థులను పరామర్శించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా ఆస్పత్రికి వెళ్లారు. యువతి ఆరోగ్యంపై వైద్యుల నుంచి జేపీ నడ్డా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మెరువైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. నిరసన సందర్భంగా గాయపడిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ఆమెను ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం జరిగిన పోలీసుల లాఠీచార్జీలో యువతి అత్యంత తీవ్రంగా గాయపడినట్లుగా డాక్టర్లు భావిస్తున్నారు.
అభిజీత్ దీప్కే క్షమాపణ
గాయపడిన విద్యార్థులను పరామర్శించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే భావోద్వేగంగా స్పందించారు. ‘‘మా మద్దతుదారులందరికీ ముఖ్యంగా పురుష పోలీసుల చేతిలో దారుణంగా దాడికి గురైన విద్యార్థినులకు నేను క్షమాపణ చెబుతున్నాను. మిమ్మల్ని రక్షించడంలో మేము మరింత మెరుగ్గా వ్యవహరించాల్సింది. ఢిల్లీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడేందుకు ప్రభుత్వం యువ విద్యార్థుల రక్తం చిందించడానికి కూడా వెనుకాడలేదు.’’ అని వ్యాఖ్యానించారు. నిరసనలో గాయపడిన వారు తనను నేరుగా సంప్రదించాలని కోరారు.
ఆస్పత్రికి కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒక విద్యార్థిని ప్రస్తుతం అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతోంది. మిగతా గాయపడిన విద్యార్థులు, పోలీసు సిబ్బందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. సోషల్ మీడియాలో 110 మంది గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సంఖ్యపై అధికారిక సమాచారం లేదు.’’ అని చెప్పారు.
నడ్డా, రాహుల్, ప్రియాంక పరామర్శ
మరోవైపు కేంద్ర మంత్రి, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉదయం ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అదే సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆస్పత్రికి చేరుకుని గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. విద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.