July 21, 2026

Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..

Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
Reading Time: 2 minutes
Rohit Sharma Reveals Historic Lords Century Came With Shardul Thakurs Bat

Rohit Sharma: ఇది చివరి మ్యాచ్‌.. రిటైర్మెంట్‌ తప్పదు.. లార్డ్స్‌ వన్డేనే.. హిట్ మ్యాన్‌ చివరి వన్డే.. దీనికోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.. ఇలా ఎన్నో పుకార్లు వచ్చాయి.. అందుకు రోహిత్‌ శర్మ ఫామ్‌ కోల్పోవడానికి ముడి పెట్టి మరీ ప్రచారం మొదలు పెట్టారు.. కానీ, తనలో ఇంకా పస తగ్గలేదని.. పరుగుల దాహం తీరలేదని.. బ్యాట్‌తేనే సమాచారం చెప్పాడు రోహిత్.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అద్భుతమైన సెంచరీతో మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 138 పరుగులు చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ చారిత్రక ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికర విషయం మ్యాచ్ అనంతరం వెలుగులోకి రావడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. రోహిత్ ఈ సెంచరీని తన సొంత బ్యాట్‌తో కాకుండా, భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్‌తో సాధించినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని శార్దూల్ ఠాకూర్ స్వయంగా వెల్లడించాడు. తాను ఎస్‌ఎస్ బ్యాట్స్ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నానని, ఆ సంస్థ నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన బ్యాట్లు తనకు అందుతాయని తెలిపాడు. ఆ బ్యాట్లను చూసిన రోహిత్ శర్మ ఒక రోజు తన వద్ద రెండు బ్యాట్లు అడిగాడని శార్దూల్ వివరించాడు. “రోహిత్‌కు నా బ్యాట్లు చాలా నచ్చాయి. అతను అడగగానే రెండు బ్యాట్లు ఇచ్చాను. మేమంతా రోహిత్‌ను ఎంతో గౌరవిస్తాం. భారత క్రికెట్‌కు అతను ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. అలాంటి ఆటగాడికి బ్యాట్ ఇవ్వకుండా ఉండే ప్రశ్నే లేదు. లార్డ్స్ లాంటి చారిత్రక మైదానంలో నా బ్యాట్‌తో అతను తన కెరీర్‌లో గుర్తుండిపోయే సెంచరీ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అని శార్దూల్ పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్‌ల మధ్య అనుబంధం టీమ్ ఇండియాకే పరిమితం కాదు. ఇద్దరూ ముంబై క్రికెట్ వ్యవస్థ నుంచే ఎదిగారు. ఒకే పాఠశాలలో క్రికెట్ నేర్చుకోవడంతో పాటు దేశీయ క్రికెట్‌లో కలిసి ఆడారు. ముంబై ఇండియన్స్ జట్టులో కూడా డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. ఈ స్నేహబంధమే రోహిత్‌కు శార్దూల్ బ్యాట్ అందేలా చేసింది.

388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత అతను ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా తన విజయాన్ని ఆస్వాదించాడు. అనంతరం విరాట్ కోహ్లీ వచ్చి అతన్ని అభినందిస్తూ కౌగిలించుకోవడం కూడా అభిమానులను ఆకట్టుకుంది. రోహిత్ తన బ్యాట్‌ను పైకెత్తి డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు స్టాండ్స్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు అభివాదం చేశాడు. అయితే, రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్ భారత్‌కు విజయాన్ని అందించలేకపోయింది. 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. అయినప్పటికీ లార్డ్స్‌లో రోహిత్ శర్మ ఆడిన ఈ చారిత్రక శతకం, దాని వెనుక ఉన్న శార్దూల్ బ్యాట్ కథ క్రికెట్ అభిమానుల మదిలో చిరకాలం నిలిచిపోనుంది.