Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..

Se*xual Harassment : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో ఘోరమైన లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. తనతో పాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని సుమ అనే లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, తన వ్యక్తిగత మరియు ప్రైవేట్ వీడియోలను దొంగతనంగా చిత్రీకరించి తీవ్ర బెదిరింపులకు దిగాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన ఐపీఎస్ స్థాయి శిక్షణలో ఉన్న అధికారి ఇలాంటి అరాచకానికి ఒడిగట్టడం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
బాధిత అధికారిణి ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆ ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటమే కాకుండా, ఇప్పటికే ఆ వీడియోలన్నింటినీ ఆమె భర్తకు పంపించి మానసికంగా నరకం చూపించాడు. బాధితురాలి నుంచి అందిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఐపీఎస్ శిక్షణలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ హైప్రొఫైల్ వేధింపుల కేసుపై పోలీసులు అత్యంత గోప్యంగా దర్యాప్తు జరుపుతున్నారు.