July 21, 2026

గోద్రెజ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లా రైతులకు వరం: డిప్యూటీ సీఎం భట్టి

గోద్రెజ్  ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ  ఖమ్మం జిల్లా రైతులకు వరం: డిప్యూటీ సీఎం భట్టి
Reading Time: 2 minutes

గోద్రెజ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లా రైతులకు వరం: డిప్యూటీ సీఎం భట్టి

Caption of Image.

ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా అడవులకు, భారీ పరిశ్రమలకు నిలయంగా ఉండేదని.. ఇపుడు  ఖమ్మం కేవలం వ్యవసాయంపైనే ఆధారపడే జిల్లాగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  కొణిజర్ల మండలంలో రూ. 300 కోట్ల భారీ వ్యయంతో, 113 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ‘గోద్రెజ్ ఆగ్రోవేట్ పామాయిల్ ఫ్యాక్టరీ’ని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా రైతాంగానికి ఈ ఫ్యాక్టరీ ఒక వరం లాంటిదన్నారు. ఈ క్రమంలో రైతుల ఆర్థిక స్థితిగతులు మారాలంటే, సాంప్రదాయ పంటల నుంచి లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అశ్వరావుపేట పరిసర ప్రాంతాల్లో నాటిన పామాయిల్ సాగు బీజం.. నేడు జిల్లాలో ఫ్యాక్టరీలు నిర్మించే స్థాయికి ఎదగడం హర్షణీయమన్నారు.

 ఒకసారి పామాయిల్ మొక్క నాటితే.. ఏకంగా 40 సంవత్సరాల పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మార్కెట్‌లో పామాయిల్‌కు ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ…దేశంలో 27 లక్షల మిలియన్ టన్నుల ఆయిల్ అవసరం ఉంటే, మనం కేవలం 12 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నాం. మిగిలిన ఆయిల్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే మన రైతులు పామాయిల్ సాగును మరింత పెంచాలి. మూడేళ్ల క్రితం టన్నుకు 12 వేల రూపాయలు ఉన్న ధర.. ఈరోజు 23 వేల రూపాయలకు పెరగడమే దీనికి నిదర్శనం. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 50 వేల ఎకరాల్లో జరుగుతున్న ఈ సాగును మరింత అదనంగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాబోయే ‘ఎల్ నినో’ వంటి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేలా రైతులు పంటలు పండించాలని సూచించారు.

రైతే రాజుగా ఎదగాలనేదే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చాటిచెప్పిన డిప్యూటీ సీఎం.. కేవలం 9 రోజుల్లోనే 9 లక్షల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని గర్వంగా ప్రకటించారు. పామాయిల్ రైతులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని, సీడ్ గార్డెన్ ఏర్పాటుకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ రవాణా సౌకర్యాల కోసం త్వరలోనే రోడ్లు మంజూరు చేస్తామన్నారు.

ALSO READ : ప్రధాని మోదీకి లేఖ రాసినా నో రెస్పాన్స్..

ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పట్టుబట్టి పనిచేయించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, భూములు ఇచ్చి సహకరించిన స్థానిక రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో గోద్రెజ్ సంస్థ రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని.. రానున్న రోజుల్లో కొణిజర్ల మండలం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా ఎదుగుతుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.