July 19, 2026

2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!

2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
Reading Time: 1 minute
Mohammed Kaif Backs Rohit Sharma And Virat Kohli For 2027 Odi World Cup Questions Bcci Selectors

Mohammed Kaif Slams BCCI: టీమిండియా సీనియర్ స్టార్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల మధ్య మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా ఈ ఇద్దరు దిగ్గజాల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల హిట్‌మ్యాన్‌ను ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ సెలెక్టర్లు ఉన్నారనే వార్తలు రావడంతో ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే ఆ వార్తలను ఖండిస్తూ.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్‌కు చివరిది కాదని స్పష్టం చేశారు.

క్రిక్‌బజ్‌లో జరిగిన చర్చలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ… ‘2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. అక్కడి బౌన్సీ పిచ్‌లు, భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులు జట్టులో తప్పనిసరిగా ఉండాలి. యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నప్పటికీ.. పెద్ద టోర్నీల్లో అనుభవం ఎంత కీలకమో అందరికీ తెలుసు. అందుకే రాబోయే రోజుల్లో వీరిద్దరూ ఎక్కువ వన్డేలు ఆడి మంచి ఫామ్‌లో ఉండాలి. బీసీసీఐ సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ఈ విషయాన్ని ఓసారి పరిశీలించాలి’ అని కోరాడు.

టీమిండియాలో రోహిత్, విరాట్ ప్రాధాన్యతను వివరించే క్రమంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని కైఫ్ ఉదాహరించాడు. ‘మెస్సీకి 39 ఏళ్లు వచ్చినా అతడి అనుభవమే అర్జెంటీనాకు అతిపెద్ద బలం. సెమీఫైనల్లో గోల్ చేయకపోయినా అసిస్ట్ ఇచ్చి జట్టును ముందుకు నడిపించాడు. యువ ఆటగాళ్లు మ్యాచ్‌ను ముగిస్తే.. అనుభవజ్ఞులు వారికి సరైన మార్గనిర్దేశం చేస్తారు. అర్జెంటీనాకు మెస్సీ ఎంత ముఖ్యమో.. భారత జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా అంతే ముఖ్యం’ అని కైఫ్ చెప్పాడు.

క్రికెట్ అయినా, ఫుట్‌బాల్ అయినా పెద్ద టోర్నీల్లో అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని కైఫ్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో విజయవంతం కావాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సేవలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. రో-కోలు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లు అని, ఇద్దరు 2027 ప్రపంచ కప్ వరకు భారత జట్టుకు కీలక బలంగా కొనసాగాలని కైఫ్ కోరాడు.