July 20, 2026

All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..

All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
Reading Time: < 1 minute
India Bloc Walkout All Party Meeting Rebel Tmc Mps Seating

All-Party Meeting: జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చింది. అయితే, ఈ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. తిరుగుబాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఎంపీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆధ్వర్యంలో పార్లమెంట్ అనెక్సీ భవనంలో ఈ సమావేశం జరిగింది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టనున్న బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశానికి టీఎంసీ రెబల్ ఎంపీలను కేంద్రం ఆహ్వానించింది. దీనిపై ఇండియా కూటమి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇండియా (NCPI) పార్టీలో విలీనమయ్యారు. వీరికి ప్రత్యేకంగా ఒక టేబుల్ కేటాయించడం వివాదాస్పదమైంది. దీనికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరుగుబాటు ఎంపీల కొత్త పార్టీని ఇంకా అధికారికంగా గుర్తించలేదని, అలాంటప్పుడు వారిని ఎలా సమావేశానికి ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. వాకౌట్ చేసిన పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్ష పార్టీలు, శివసేన(యూబీటీ)లు ఉన్నాయి.