July 21, 2026

Petrol Prices: దేశ ప్రజలకు మరోసారి పెట్రోల్, డీజిల్ షాక్..! త్వరలో మరింత పెరిగే అవకాశం..

Petrol Prices: దేశ ప్రజలకు మరోసారి పెట్రోల్, డీజిల్ షాక్..! త్వరలో మరింత పెరిగే అవకాశం..
Reading Time: 2 minutes
Petrol Prices: దేశ ప్రజలకు మరోసారి పెట్రోల్, డీజిల్ షాక్..! త్వరలో మరింత పెరిగే అవకాశం..

దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగనున్నాయా..? మరోసారి వాహనదారులు, సామాన్యులకు షాక్ తగలనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది. దీంతో హర్ముజ్ జలసంధి మళ్లీ మూసివేయడంతో ఇంధన సరఫరాకు నిలిచిపోయింది. దీని వల్ల ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి కేంద్రం పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.7.50 మేర పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచితే సామాన్యులపై భారీగా భారం పడనుంది. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేని చర్చనీయాంశంగా మారింది.

భారీగా పెరుగుతున్న ముడి చమురు ధరలు

అమెరికా-ఇరాన్ యుద్దం చమురు మార్కెట్‌లో మళ్లీ ఉద్రిక్తతలను రేకెత్తించింది. కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవ్వడంతో.. హోర్ముజ్ జలసంధి మరోసారి మూసుకుపోయింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ ఆందోళన కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లను దాటాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ తర్వాత ఇది బ్యారెల్‌కు 71 డాలర్లకు పడిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో.. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయనే భయాలను మరోసారి పెంచింది. బ్రెంట్ ముడి చమురు ఈరోజు 2.70 శాతం పెరిగి బ్యారెల్‌కు 90.52 డాలర్లకు చేరింది. ఇక యూఎస్ ముడి చమురు 2.27 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.37 డాలర్లకు చేరింది.

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయా..?

గత వారం ముడి చమురు ధర  72 డాలర్ల వద్ద ఉంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొనే సూచనలు కనిపించడం లేదు. అమెరికా చేస్తున్న భారీ సైనిక సన్నాహాల వల్ల ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఎలాంటి నష్టభయం లేకుండా ఉండేందుకు చమురు వ్యాపారులు అధిక ధరలకు ముడి చమురును కొనుగోలు చేయవలసి వస్తోంది. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొని, సముద్ర మార్గాలు సురక్షితమయ్యే వరకు ముడి చమురు ధరలు తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి దీర్ఘకాలం పాటు మూసివేయడం, అమెరికా-ఇరాన్‌ల మధ్య సుదీర్ఘ యుద్ధం కొనసాగడం వంటివి ముడి చమురు ధరలను మరింత పెంచే అవకాశముందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.