పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ : డీజీపీ సీవీ ఆనంద్

- 2022–23లో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పోలీస్ రిక్రూట్మెంట్: డీజీపీ సీవీ ఆనంద్
- 16,654 పోస్టులు భర్తీ చేసినట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పోలీస్ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా నిర్వహిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం పోలీస్ ట్రైనింగ్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పనితీరు, నియామకాల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సమగ్ర ప్రజంటేషన్ ఇచ్చారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. 2022–23లో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పోలీస్ నియామక ప్రక్రియ ద్వారా 16,654 పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో 95 శాతం కానిస్టేబుల్ పోస్టులు, 5 శాతం ఎస్‌ఐ పోస్టులు ఉన్నట్టు చెప్పారు. 2025 నోటిఫికేషన్లలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూ టర్, 1,743 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
తొలిసారిగా నిర్వహించిన ఫింగర్ ప్రింట్, ఫోరె న్సిక్ పోస్టుల నియామకంలో 60 పోస్టులకు 57 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్‌లో 33శాతం రిజర్వేషన్, బయో మెట్రిక్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ, మొబైల్, ఈ-మెయిల్ రిజిస్ట్రేషన్, ¼ నెగెటివ్ మార్కింగ్ వంటి సంస్కరణలు చేశామన్నారు.
ఆర్‌ఎస్‌ఐ నుంచి ఎస్‌ఐ, సివిల్ పీసీ నుంచి టీజీఎస్‌పీ, ఇతర విభాగాల్లో పోస్టుల కన్వర్షన్, రిజర్వేషన్ విధానాలకు సంబంధించిన అంశాలను డీజీపీ వివరించారు. సమావేశంలో నూతన కమ్యూనికేషన్ సెట్లను డీజీపీ సీవీ ఆనంద్ ఆవిష్కరించారు. సమీక్షలో సీఐడీ డీజీ చారు సిన్హా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.