Reading Time: 2 minutes
Warren Buffett Mother Leila Stahl Discipline Investment Success Story

Warren Buffett: స్టాక్ మార్కెట్ దిగ్గజం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన వారెన్ బఫెట్ పేరు వినని వారుండరు. అయితే నేడు మదర్స్ డే సందర్భంగా ఆయన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో గురించి కాకుండా, ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఆయన తల్లి లీలా స్టాల్ బఫెట్ గురించి, తల్లితో తనకు ఉన్న బంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘ద స్నోబాల్’ పుస్తకం ప్రకారం.. ఆయన విజయ రహస్యం వెనుక ఉన్న ఎమోషనల్ జర్నీ ఇది.

అమ్మ అంటే భయం.. ఇంట్లో నిశ్శబ్దం
నిజానికి వారెన్ బఫెట్ అంటే మనకు గుర్తొచ్చేది అత్యంత క్రమశిక్షణ గల పెట్టుబడిదారుడు. కానీ ఆ క్రమశిక్షణ ఆయనకు పుట్టుకతో రాలేదు.. తన తల్లి పెట్టిన కఠినమైన నియమాల నుంచే వచ్చింది. చాలామంది ధనవంతుల పిల్లల్లా బఫెట్ బాల్యం విలాసవంతంగా సాగలేదు. ఆయన తల్లి లీలా స్టాల్ చిన్న చిన్న తప్పులకే తీవ్రంగా కోప్పడేవారని, ఆమె మూడ్ బాలేనప్పుడు ఇల్లంతా మౌనంగా ఉండేదని బఫెట్ తన బయోగ్రఫీలో గుర్తుచేసుకున్నారు. ఒకసారి డిన్నర్ టేబుల్ దగ్గర తల్లి కోపానికి భయపడి చిన్నారి వారెన్ తన గదిలోకి వెళ్లి దాక్కున్న సంఘటన ఆయనపై చెరగని ముద్ర వేసింది.

ఇంట్లోనే ‘మనీ మేనేజ్‌మెంట్’ పాఠాలు
బఫెట్ తన మనీ మేనేజ్‌మెంట్ పాఠాలను హార్వర్డ్ లేదా కొలంబియా యూనివర్శిటీల్లో నేర్చుకోలేదు. తన సొంత ఇంట్లోనే నేర్చుకున్నారు. బఫెట్ తల్లి లీలా స్టాల్‌కు వృథా ఖర్చులు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట. ప్రతి పైసాకు లెక్క ఉండేదట. మిగతా పిల్లలు బొమ్మల కోసం మారాం చేసే వయసులో, వారెన్ తన పాకెట్ మనీని ఎలా పెంచుకోవాలని ఆలోచించేవారు. చిన్న వయసులోనే చ్యూయింగ్ గమ్స్ అమ్మడం, పేపర్లు వేయడం ద్వారా డబ్బు సంపాదించి, వాటిని ఖర్చు చేయకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకున్నారు. వారెన్ బఫెట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలో అతి ముఖ్యమైనవి ఓపిక, క్రమశిక్షణ. నిజానికి అప్పుడప్పుడు మార్కెట్ ఎంత పడిపోయినా ఆయన భయపడరు. దీని వెనక ఉన్న మొండి ధైర్యం ఆయనకు తన బాల్యంలో ఎదుర్కొన్న సవాళ్ల నుంచే వచ్చింది. తన బాల్యంలో ఆయన ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులు తనను మానసికంగా దృఢంగా మార్చాయి. ఆర్థిక భద్రత అంటే కేవలం బ్యాంకులో డబ్బు ఉండటం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమేనని ఆయన చిన్నప్పుడే నేర్చుకున్నారు.

సాధారణ జీవితం.. అసాధారణ వ్యక్తిత్వం
వారెన్ బఫెట్ నేడు ప్రపంచంలోనే టాప్ బిలియనీర్లలో ఒకరైనప్పటికీ, ఇప్పటికీ దశాబ్దాల క్రితం కొన్న తన పాత ఇంట్లోనే ఆయన బతుకున్నారు. నిజానికి ఆయన డబ్బును హోదా కోసం కాకుండా ఒక బాధ్యతగా భావిస్తారు. ఏ సంబంధం కూడా పర్ఫెక్ట్‌గా ఉండదు. కొన్నిసార్లు కఠినమైన సంబంధాలే మనకు జీవితంలో పెద్ద పాఠాలు నేర్పుతాయి. చిన్నతనంలో ఏ తల్లి కోపానికి వారెన్ బఫెట్ వణికిపోయారో, అదే తల్లి నేర్పిన క్రమశిక్షణ నేడు ఆయనను ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్‌గా నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మదర్స్ డే సందర్భంగా బఫెట్ కథ మనకు ఇచ్చే సందేశం కూడా ఇదే.