
రాజకీయాల్లో ఎవరు నమ్మకస్తులో.. ఎవరిని నమ్మాలో కచ్చితంగా చెప్పడం కష్టమే. ఎంత అనుచరుడైనా.. ప్రాణమిచ్చే సహచరుడైనా ఆవగింజంతా అనుమానంతో చూడాల్సిందేనని అంటుంటారు. అది నిజమేనని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కు జరిగిన గుణపాఠం ఆధారంగా చెప్పవచ్చు.
యువకుడు, తెలివైన వాడని.. రాఘవ్ చద్దాను రాజ్యసభకు పంపారు కేజ్రీవాల్. చిన్నవాడైనా పెద్దల సభలో ఆప్ బాధ్యతలను చద్దా భుజాలపై ఉంచారు. బాస్ నమ్మకాన్ని వమ్ము చేయనట్లుగానే అనతి కాలంలోనే ఎదిగాడు చద్దా. వివిధ అంశాలపై విభిన్న కోణంలో ప్రసంగాలు ఇస్తూ.. కామన్ మ్యాన్ సమస్యలను ప్రస్థావిస్తూ దేశం దృష్టిని ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా రీచార్జ్ పేరిట టెలికాం కంపెనీల మోసాన్ని ఎండగట్టిన తీరు యూత్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. నెలకు 28 రోజులకే రీచార్జ్ చేస్తూ.. ఏడాదికి 13 నెలలు రీచార్జ్ చేసుకునేలా కస్టమర్ల మీద భారం మోపడంపై మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే విధంగా జీఎస్టీ, ట్యాక్స్ మొదలైన ఎన్నో అంశాలపై చద్దా తనదైన శైలిలో రాజ్యసభలో గళమెత్తారు.
రాఘవ్ చద్ధా కామనర్ వాయిస్ వినిపిండం వరకు ఓకే. కానీ పార్టీ లైన్ మరిచిపోవడం.. పార్టీపై వస్తున్న అలిగేషన్స్ గురించి మాట్లాడకపోవడం ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కు ఆగ్రహం తెప్పించింది. లిక్కర్ కేసుపై మాట్లాడకపోవడం, కేజ్రీవాల్ నిర్ధోషి అని తేలినా సరిగ్గా స్పందించకపోవడం పార్టీ ఆగ్రహానికి కారణమైంది. ఆప్ లో ఉంటూ బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని.. సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు, చద్దాకు మధ్య దూరం కూడా పెరిగిపోయింది. పార్టీ అభివృద్ధిని కాదని సొంత ఎజెండాను అమలు చేస్తున్న చద్ధాను రాజ్యసభ బాధ్యతల నుంచి తప్పించారు.
- నమ్మిన బంటు నమ్మక ద్రోహం..?
రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా రాఘవ్ చద్ధాను తొలగించినా ఆప్.. ఆ స్థానంలో అశోక్ మిట్టల్ అనే మరో ఎంపీని కూర్చోబెట్టింది. చద్ధా నిర్వర్తించిన బాధ్యతలు చూసుకోవాల్సిందిగా.. రాజ్యసభలో పార్టీ తరఫున గట్టగా మాట్లాడాల్సిందిగా ఆయనకు అవకాశం ఇచ్చింది. చద్దా పోతేనేమి.. నా నమ్మిన బంటు అశోక్ మిట్టల్ ఉన్నాడుగా.. అనుకున్న కేజ్రీవాల్ కు చద్దా ఇచ్చిన షాక్ ను మించి ఇచ్చేశాడు ఈ మిట్టల్.
రాజ్యసభలో ఆప్ ను బీజేపీలో విలీనం చేస్తున్నట్లు శుక్రవారం (ఏప్రిల్ 24) రాఘవ్ చద్ధా ప్రకటించిన విషయం తెలిసిందే. 10 మంది సభ్యులున్న ఆప్ నుంచి 7 మంది అంటే 2/3 సభ్యులు బీజేపీలో విలీనం అయ్యారు. అంటే పార్టీ విలీనం అయినట్లే. ఆశ్చర్యకరంగా రాఘవ్ చద్ధా స్థానంలో బాధ్యతలు తీసుకున్న అశోక్ మిట్టల్ ఆ లిస్టులో ఉండటం కేజ్రీవాల్ కు ఊహించని ఎదురుదెబ్బ. చద్దా పోతేనేమి.. అలాంటి నేతను తయారు చేసుకుంటామని నియమించిన తన నమ్మని బంటు మిట్టల్.. బీజేపీలో చేరడంపై కేజ్రీవాల్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్ అనే చెప్పాలి.
శుక్రవారం (2026 ఏప్రిల్ 24) ఆమ్ ఆద్మీ పార్టికి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బేజీలో చేరడం ఆప్ భవిష్యత్ ను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీలో చేరిన వారిలో రాఘవ్ చద్ధాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీ ఉన్నారు.
రాజ్యసభలో ఆప్.. బీజేపీలో విలీనం కావడంపై ఆప్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ద్రోహులను పంజాబ్ ప్రజలు క్షమించరు అని విమర్శించింది. బీజేపీ మరోసారి పంజాజీలకు ద్రోహం చేసిందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. బీజేపీ ఆపరేషన్ లోటస్ మరోసారి ప్రరంభించిందన్నారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తమ పార్టీ ఎంపీలను ప్రలోభాలకు గురిచేసిందన్నారు. మూడు రోజుల క్రితం అశోక్ మిట్టల్ ఇంటిపై దాడి జరగగా.. ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని.. చేరిపోయారని అన్నారు. అవినీతిని నిర్మూలించాల్సిన సంస్థలను నీతిమాలిన రాజకీయాలకు బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు.