
Telangana High Court: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీష్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసుల్లో వీరిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. 2011 మార్చిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ట్యాంక్ బండ్ వద్ద జరగగా.. ఆ సమయంలో ఆందోళనకారులు కొన్ని మీడియా సంస్థలకు చెందిన కెమెరాలు, వోబీ వ్యాన్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను కూడా నిందితులుగా చేర్చారు. అయితే, ఈ ఘటనకు పిటిషనర్లకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వారి తరఫు న్యాయవాది రమణారావు కోర్టులో వాదనలు వినిపించారు. ఇక, వాదనలు విన్న హైకోర్టు, కేసులో సరైన ఆధారాలు లేవని భావించి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుపై నమోదైన కేసులను కొట్టివేసింది. దీంతో బీఆర్ఎస్ నాయకత్వానికి ఇది కీలక ఊరటగా భావిస్తున్నారు. కాగా, తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన ఈ కేసులో హైకోర్టు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మిలియన్ మార్చ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, ఈ తీర్పుకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఏర్పడింది.