
Joe Root : ఇంగ్లాండ్ క్రికెట్‌లో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా పరిణామాలు వేగంగా మారిపోయాయి. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) నూతన కెప్టెన్ అన్వేషణలో పడింది. దాదాపు మూడు వారాల సుదీర్ఘ చర్చల అనంతరం, జట్టును మళ్లీ విజయవంతంగా నడిపించేందుకు సీనియర్ బ్యాటర్ జో రూట్ వైపే బోర్డు మొగ్గు చూపింది. గతంలో 2022 వరకు జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉండటంతో, రాబోయే కీలకమైన సిరీస్‌ల కోసం రూట్ సరైన ఎంపిక అని ఈసీబీ భావించింది.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నో టైటిళ్లు అందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను హెడ్ కోచ్‌గా తీసుకునేందుకు ఈసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి కోచ్ ఒప్పందం ఖరారయ్యే వరకు ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించనున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఉన్న ఒప్పందాల వల్ల ఆండీ ఫ్లవర్ ఈ రేసు నుంచి తప్పుకోవడంతో ఫ్లెమింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
జో రూట్ కెప్టెన్సీ రెండో ఇన్నింగ్స్ వచ్చే ఏడాది స్వదేశంలో జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే, అంతకంటే ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా పర్యటనలలో జరగబోయే టెస్టు సిరీస్‌లు రూట్‌కు అతిపెద్ద సవాలుగా మారనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్ ఈ రెండు సిరీస్‌లను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనతో పాటు, టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవం సందర్భంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగే చారిత్రాత్మక డే-నైట్ టెస్టుకు కూడా రూట్ సారథ్యం వహించనున్నాడు.
జో రూట్‌కు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. జో రూట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంటూ సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ టెస్ట్ రికార్డుల వైపు వేగంగా అడుగులు వేస్తున్న వేళ, మళ్లీ కెప్టెన్సీ భారం పెట్టడం అతడి బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి అరుదైన వ్యూహకర్తను ఈసీబీ దక్కించుకోవడం పట్ల బీసీసీఐపై వ్యంగ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే 33 ఏళ్ల వయసులో రూట్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కెప్టెన్సీ ఇస్తే.. బీసీసీఐ మాత్రం విరాట్ కోహ్లీని బలవంతంగా రిటైర్ చేయించి, అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు తిడుతున్నారు. కొందరు మాజీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం గతంలో రూట్ కెప్టెన్సీలో జట్టు ఓటములను గుర్తుచేస్తూ ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి