Reading Time: 2 minutes

Karmakhya Review: ‘కర్మాఖ్య’ మూవీ రివ్యూ.. అదిరే అభి మైథలాజికల్ థ్రిల్లర్ మెప్పించిందా?

Caption of Image.

వర్సటైల్ యాక్టర్ సముద్రఖని, అభిరామి, సమైరా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘కర్మాఖ్య’ (Karmakhya). మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ శుక్రవారం (జూలై 31, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి (అభినయ కృష్ణ) ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్య ప్రదీప్, ధనరాజ్, ఐశ్వర్య, గడ్డం నవీన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అభి డైరెక్ట్ చేసిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలా ఉంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయా? ప్రేక్షకులను చివరి వరకు సీట్లలో కూర్చోబెట్టిందా? లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే: 

అస్సాంలోని కామాఖ్య ఆలయం, తంత్ర విద్యల నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది. 20 ఏళ్ల క్రితం చేతబడులు చేస్తున్నారనే ఆరోపణలతో ఓ వ్యక్తి  (మధునందన్), ఆమె భార్యని గ్రామస్థులు చంపేస్తారు. ఈ క్రమంలోనే వారి కుమార్తె చిన్ని అదృశ్యమవుతుంది.

కట్ చేస్తే, 20 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం వైజాగ్‌లో ఓ హాస్టల్ లో కామాఖ్య(సమైరా).. తన ఫ్రెండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రవల్లిక (శరణ్య ప్రదీప్)తో కలిసి ఉంటుంది. అయితే, ఓ రోజు ప్రవల్లికకు బదులుగా ఇన్సూరెన్స్ పని కోసం కామాఖ్య విశాఖ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలోని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆ ఇంట్లో ఉన్న సరోజిని (అభిరామి) చేతికి చిక్కుతుంది. ఇక ఉన్నట్టుండి కామాఖ్యను బలి ఇవ్వాలని సరోజిని కుటుంబం ప్రయత్నిస్తుంది.

అసలు సరోజిని కుటుంబం ఎవరు? కామాఖ్యను ఎందుకు బలి ఇవ్వాలనుకుంటున్నారు? చిన్ని ఏమైంది? ఈ ఘటనలకు పోలీస్ అధికారి తిరుపతి (సముద్రఖని), కామాఖ్య ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటి? అనేదే మిగతా కథ.

మూవీ ఎలా ఉందంటే?

కమిడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి దర్శకుడిగా మారి.. తన రెండో సినిమానే సీరియస్ ‘మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్’ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. అస్సాం కామాఖ్య ఆలయం, చేతబడులు, నరబలి వంటి మూఢనమ్మకాల కాన్సెప్ట్‌కు క్రైమ్ ఎలిమెంట్ జోడించి కథను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది.

ఫస్టాఫ్..

సినిమా ప్రారంభంలో 20 ఏళ్ల క్రితం నాటి ఫ్లాష్‌బ్యాక్ సీన్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. వైజాగ్‌లో సమైరా, శరణ్య ప్రదీప్‌ల మధ్య వచ్చే సన్నివేశాలతో ఆడియన్స్ కథలో లీనమవుతాడు. ఇక ఎప్పుడైతే సమైరా ఆ నిర్మానుష్యమైన ఇంటికి వెళ్లాక, అభిరామి కుటుంబం ఆమెను బంధించే సన్నివేశాల నుంచి ఫస్టాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చే ట్విస్ట్ సెకండాఫ్ పై  మంచి హైప్ క్రియేట్ చేస్తుంది.

సెకండాఫ్ 

సెంకడాఫ్ లో నటుడు సముద్రఖని ఎంట్రీతో ఇన్వెస్టిగేషన్ వేగం పుంజుకుంటుంది. కామాఖ్య ఆలయానికి, ఈ హత్యలకు, మరియు తప్పిపోయిన ‘చిన్ని’కి ఉన్న లింక్‌ను ముడి విప్పే సన్నివేశాలు ఆడియన్స్ను వీపరీతంగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే ట్విస్టులు, తంత్ర పూజల బ్యాక్‌డ్రాప్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి.

నటీనటుల పనితీరు:

పోలీస్ ఆఫీసర్‌గా తనదైన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ జరిపే సన్నివేశాల్లో ఆయన నటన మరింత క్యూరియాసిటీ పెంచుతుంది. ఇటీవలే బ్లాస్ట్ మూవీతో మెప్పించిన అభిరామి.. ఈ సినిమాలో కూడా సస్పెన్స్ క్యారెక్టర్లో అలరించింది. ఇందులో కనపడని ఒక సీరియస్ అండ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అభిరామి జీవించేశారు. భయంకరమైన నరబలి నేపథ్యం ఉన్న పాత్రలో ఆమె భయపెడతారు. ఇక హీరోయిన్గా నటించిన సమైరా భయపడే సన్నివేశాల్లో, ప్రాణాలను రక్షించుకునే క్రమంలో మంచి నటన కనబరిచింది. శరణ్య ప్రదీప్, ధనరాజ్, గడ్డం నవీన్ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

టెక్నీకల్ అంశాలు:

జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి (అభినయ కృష్ణ) దర్శకుడిగా తన రెండో సినిమాతో మరో మెట్టు ఎక్కారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులతో ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. గ్యాని అందించిన BGM అదిరిపోయింది. మైథలాజికల్ థ్రిల్లర్‌కు అవసరమైన సస్పెన్స్, ఉత్కంఠను పెంచడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇక నిర్మానుష్యమైన ఇంటి వాతావరణం, తంత్ర పూజలకు సంబంధించిన సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ రమేశ్‌రెడ్డి చక్కగా ఆవిష్కరించారు. నిర్మాణ విలువలు కూడా సినిమా కథకు, జానర్‌కు తగ్గట్టుగా మెరుగ్గా ఉన్నాయి.

©️ VIL Media Pvt Ltd.