Reading Time: < 1 minute

పీరియడ్ లీవ్స్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం.. ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్న కోర్ట్

Caption of Image.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దేశవ్యాప్తంగా రుతుక్రమ సెలవుల(Menstrual Leave) అమలు కోసం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు సామాజిక, ఆర్థిక కోణాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహిళా విద్యార్థినులు, ఉద్యోగినుల కోసం ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. ఇటువంటి చట్టం మహిళల ఉపాధి అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు.

రుతుక్రమం పట్ల అవగాహన పెంచడం వేరని.. అయితే దానిని చట్టబద్ధమైన నిబంధనగా మార్చడం వల్ల యజమానుల మనస్తత్వంలో మార్పు వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తే.. వ్యాపార సంస్థల ఓనర్లు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి వెనకాడతారని, ఇది పరోక్షంగా వారి కెరీర్‌కు ఆటంకంగా మారుతుందని కోర్టు హెచ్చరించింది. “యజమానుల మనస్తత్వం గురించి మీకు తెలియదు. ఇటువంటి చట్టం చేస్తే వారు మహిళలకు ఉద్యోగాలే ఇవ్వరు” అని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ రూల్స్ తీసుకొస్తే మహిళలు పురుషుల కంటే తక్కువ సామర్థ్యం కలవారనే తప్పుడు సంకేతం సమాజంలోకి వెళ్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలను తక్కువ చేసి చూపేలా లేదా రుతుక్రమాన్ని ఒక బలహీనతగా చిత్రీకరించేలా ఇటువంటి పిటిషన్లు ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ కంపెనీలు స్వచ్ఛందంగా ఇటువంటి సెలవులను ఇవ్వడాన్ని కోర్టు స్వాగతించింది కానీ, దానిని ప్రభుత్వం చట్టం ద్వారా బలవంతం చేయకూడదని అభిప్రాయపడింది. 

ALSO READ : నెట్టింట బాయ్‌కాట్ ‘SRH’ ట్రెండ్..

అయితే రుతుక్రమ పరిశుభ్రతను మహిళల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గతంలోనే గుర్తించిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. జనవరిలో జరిగిన ఒక విచారణలో.. రుతుక్రమ పరిశుభ్రత అనేది గౌరవప్రదమైన జీవనానికి, విద్యకు, ఆరోగ్యానికి అంతర్భాగమని కోర్టు పేర్కొంది. పాఠశాలల్లో బాలికలకు ఉచిత శానిటరీ నాప్కిన్లు, ప్రత్యేక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని అప్పట్లో ఆదేశించింది. ప్రస్తుత తీర్పులో సామాజిక స్పృహ, సౌకర్యాల కల్పన అవసరమని చెబుతూనే.. ఉపాధి రంగంలో మహిళల సమానత్వానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే సెలవుల చట్టబద్ధతను ధర్మాసనం తోసిపుచ్చింది.

©️ VIL Media Pvt Ltd.