Reading Time: 2 minutes
Insomnia Tips Natural Ways To Fall Asleep Fast In Telugu

Insomnia Tips in Telugu : నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో మనిషికి అన్నీ ఉన్నాయి కానీ, హాయిగా కంటి నిండా నిద్రపోయే తీరిక, ప్రశాంతత కరువయ్యాయి. ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం ఎంత అవసరమో.. శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి (Rejuvenation) గాఢ నిద్ర కూడా అంతే ముఖ్యం. దురదృష్టవశాత్తు, పని ఒత్తిడి, నిరంతర ఆలోచనలు, స్మార్ట్‌ఫోన్ల విపరీతమైన వాడకం వల్ల ‘నిద్రలేమి’ (Insomnia) అనేది ఒక ప్రపంచవ్యాప్త ఆరోగ్య సమస్యగా మారింది. చాలా మంది పడకపైకి వెళ్లిన తర్వాత గంటల తరబడి అటు ఇటు దొర్లుతూ, నిద్ర కోసం పోరాటం చేస్తుంటారు. రాత్రి ఎంత ప్రయత్నించినా కంటికి కునుకు పట్టక ఇబ్బంది పడేవారి కోసం ఆయుర్వేదం , ఆధునిక వైద్యం కొన్ని పరిష్కారాలను చూపుతున్నాయి.

1. 15 నిమిషాల్లో నిద్రించే చిట్కాలు:
గోరువెచ్చని నీటి స్నానం: పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఇది శారీరక అలసటను పోగొట్టి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, తద్వారా నిద్ర త్వరగా పడుతుంది.

ఒక నిర్దిష్ట సమయం (Circadian Rhythm): ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది, క్రమం తప్పకుండా ఒకే సమయానికి నిద్రపోతే అది అలవాటుగా మారి నిద్రను ప్రేరేపిస్తుంది.

2. ఆహారం , అలవాట్లు:
పాలు తాగడం: పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల అందులోని ‘ట్రిప్టోఫాన్’ అనే అమైనో ఆమ్లం మనసును ప్రశాంతపరిచి గాఢ నిద్రకు సహకరిస్తుంది.

మొబైల్‌కు దూరం: నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్, టీవీ, లాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి. వీటి నుంచి వచ్చే నీలి కాంతి (Blue Light) నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.

పుస్తక పఠనం: స్క్రీన్లు చూసే బదులు ఏదైనా పుస్తకం చదవడం వల్ల కళ్లు అలసిపోయి త్వరగా నిద్రలోకి జారుకుంటారు.

3. నిద్రకు అనుకూలమైన వాతావరణం:
చీకటి , నిశ్శబ్దం: మీ పడకగది ప్రశాంతంగా, చీకటిగా ఉండేలా చూసుకోండి. వెలుతురు ఉంటే నిద్రకు అంతరాయం కలుగుతుంది. అవసరమైతే కంటికి ‘ఐ మాస్క్’ వాడుకోవచ్చు.

సాక్స్ ధరించడం: కొన్ని పరిశోధనల ప్రకారం, నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల పాదాలు వెచ్చగా ఉండి, రక్త ప్రసరణ మెరుగుపడి త్వరగా నిద్రపడుతుంది.

4. శ్వాస వ్యాయామాలు (Breathing Techniques):

  • 4-7-8 పద్ధతి: ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టెక్నిక్.
  • 4 సెకన్ల పాటు ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి.
  • 7 సెకన్ల పాటు శ్వాసను బిగబట్టాలి.
  • 8 సెకన్ల పాటు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదలాలి.
    ఇలా చేయడం వల్ల నరాలు శాంతించి నిద్ర ముంచుకొస్తుంది.

5. యోగాసనాలు:

వైద్యుల సిఫార్సు మేరకు శవాసనం, బాలాసనం, సేతు బంధాసనం వంటి ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది గుండె జబ్బులు, మధుమేహం , మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి పైన పేర్కొన్న సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా హాయిగా నిద్రపోవచ్చు.