Reading Time: < 1 minute

బెంగళూరు: పశ్చిమాసియా సంఘర్షణలతో అబుదాబిలో చిక్కుకుని ఎంతో ఉద్రిక్తతకు గురైన భారతీయులకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరగానే ఊరట లభించింది. సోమవారం రాత్రి చేరగానే వీరంతా గల్ఫ్ దేశంలో క్షిపణి దాడులు జరిగినప్పుడు ఎంత ఉద్రిక్తత అనుభవించారో గుర్తు చేసుకున్నారు. స్వదేశం చేరుకునేందుకు వీలుగా ప్రయాణ సౌకర్యం కల్పించిన ఇటిహాద్ ఎయిర్‌వేస్ కు, అబుధాబి ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. అబుధాబిలో ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్న మంగళూరుకు చెందిన సౌరభ్ సెట్టి అబుధాబిలో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని వాపోయారు. “ఫిబ్రవరి 28న విమానం చేరుకోడానికి వచ్చినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు కనిపించింది.

అకస్మాత్తుగా చెక్ చేసే సమయంలో తామంతా కింద కూర్చోవాలన్న హెచ్చరిక వచ్చింది.క్షిపణి దాడి భయంతో కిటికీలకు దగ్గరగా కూర్చోరాదన్నారు. ” అని ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు. తమ కళ్ల ముందే క్షిపణుల దాడులను చూసి భయం చెందామని, ఏ ఒక్క క్షిపణి తమపై దాడి చేసినా తామెవరం ఉండమని చాలా మంది తమ భయానక పరిస్థితిని వివరించారు. బోస్టన్ నుంచి వచ్చిన మహేష్, బెంగళూరుకు చెందిన రమ్య, కోయంబత్తూరుకు చెందిన నిరుబన్, బెంగలూరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ప్రసాద్, గిరిమలప్పకెరూర్,వీరంతా క్షిపణి దాడుల నుంచి తామెలా బయటపడ్డామో వివరించారు. ఇటిహాద్ ఎయిర్‌వేస్ కల్పించిన సౌకర్యాలను ప్రశంసించారు.