Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో అంతర్జాతీయ విమానసర్వీసుల ఆపరేషన్‌కు అవాంతరాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దయ్యాయి. 36 సర్వీసులు బయల్దేరవలసినవి కాగా, 44 సర్వీసులు రావలసినవని అధికారులు వెల్లడించారు.

ఈలోగా ఎమిరేట్స్ ఫ్లైట్ ఇకె 513 దుబాయ్‌కు వెళ్లవలసి ఉన్నప్పటికీ ఎయిర్‌స్పేస్ అవాంతరాల వల్ల తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. పశ్చిమదేశాలకు వెళ్ల వలసిన అనేక అంతర్జాతీయ విమానాలు ఆలస్యం కావడం కానీ లేదా షెడ్యూల్ సర్దుబాట్లు కానీ జరుగుతున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో రోజూ 1300 విమానసర్వీసులు నడుస్తుంటాయి. గత మూడు రోజులుగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ 1117 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మంగళవారం దుబాయ్ నుంచి డిల్లీకి 149 మంది ప్రయాణికులను ఎయిర్ ఇండియా సర్వీస్ తీసుకొచ్చింది.