Reading Time: < 1 minute

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరదుష్టితో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో వైట్ కోట్ విప్లవం సాకారమైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. దీని ద్వారా వైద్య విద్య అవకాశాలు విస్తరించి, ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు. ఉప్పల్ ఎంఎల్‌ఎ బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హరీష్ రావు నివాసంలో ఏడుగురు ఎంబిబిఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, బిఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు చెక్కులు అందజేయడం అభినందనీయమని అన్నారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఇది కేవలం దానంగా కాకుండా, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని చెప్పారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తూ, విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి ,ప్రభుదాస్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.