Reading Time: < 1 minute

అమెరికా – ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన యుద్ధంలో డ్రోన్ దాడుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లోని రెండు అమెజాన్ డేటా సెంటర్లు, బహ్రెయిన్ లోని ఒక సెంటర్ లో కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. పశ్చిమాసియా అంతటా బ్యాంకింగ్ వంటి రంగాలలో క్లౌడ్ సేవలు, కంప్యూటింగ్ సౌకర్యాలకు అంతరాయం కలిగినట్లు టెక్నాలజీ, ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఆదివారంనాడుయూఏఇ లోని రెండు డేటా కేంద్రాలను డ్రోన్ లు ఢీ కొట్టాయని అమెజాన్ తెలిపింది. బహ్రెయిన్ లోని డేటా సెంటర్ సమీపంలో భారీ దాడి వల్ల దాని మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం జరిగింది. తక్షణమే మరమ్మతులు చేపట్టినా, నష్టం తీవ్రంగా ఉండడంతో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

డేటా సెంటర్ లే లక్ష్యమా?

సాంకేతిక పరమైన అంతరాయాల వల్ల సోమవారం, మంగళవారం యుఏఇ స్టాక్ మార్కెట్ మూతపడింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేదా ఏడబ్ల్యూ ఎస్ అంతరాయల వల్ల విమాన సేవలపైనా, ప్రయాణికులపైన ప్రభావితం చూపాయి. దుబాయ్ , కువైట్ లోని విమానాశ్రయాలలో దాదాపు పదివేల మంది చిక్కుకుపోవడం ఈ స్థాయిని తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుతం కమ్యూనికేషన్లు, లాజిస్టిక్స్, సైనిక దళాల రవాణా, విస్తరణ, నిఘా సమాచారం సేకరణ, ఆయుధాల టార్గెట్, కాల్పుల వంటి కీలకమైన సైనిక చర్యలలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్, లేదా ఇరానియన్ లలో ఏ డ్రోన్ లు విరుచుకుపడ్డా పూర్తిగా ఇంటర్ నెట్ పై ఆధారపడిన ప్రపంచంలో మౌలిక సదుపాయాలకు కీలకమైన కేంద్రాలు యుద్ధ వ్యూహాలలో భాగం అవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది.కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయంగా జరిగే యుద్ధాలలో సైనిక శిబిరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేవారు. ఆహారం, నీటి సరఫరా కేంద్రాలు, ఇంధన వనరులను తర్వాతి కాలంలో లక్ష్యంగా చేసుకునేవారు.పశ్చిమాసియాలో సాంకేతిక సంస్థలు, డేటా సెంటర్ల ను లక్ష్యంగా చేసుకోవడం భవిష్యత్ లో జరిగే యుద్ధాలకు సంకేతమా అన్న సందేహాలు కలుగుతున్నాయి.