
ఎక్కువగా దుబాయ్ టార్గెట్ …ఓ వ్యక్తి మృతి
హర్మూజ్ జలసంధిలో ఓ నౌకపై దాడి
15 మంది భారతీయ సిబ్బంది సురక్షితం
దుబాయ్ : ఖమేనీ అంతంతో ఇరాన్ శనివారం రాత్రి నుంచే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై భీకర దాడులకు దిగింది. తమ అధినేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ కేబినెట్ నుంచి తీవ్రస్థాయి ప్రకటన వెలువడింది. రెవెల్యూషనరీ గార్డు రంగంలోకి దిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు రెడ్‌లైన్ దాటాయని , పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మెహమ్మద్ బఘెర్ ఖాలిబప్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రకటించారు. చావుదెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇంతకు ముందెప్పుడూ చవిచూడని విధంగా ఈ చర్య ఉంటుందని వెల్లడించారు. ఈ వాదనను ట్రంప్ తిప్పికొట్టారు. మీరేం చేయలేరని , ఒకవేళ చేస్తే తమ శక్తివంతమైన దాడికి ఇక కోలుకోలేరని స్పందించారు. ఈ నేపధ్యంలోనే ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. మరో వైపు బహరైన్, కువైట్, ఖతార్ ల్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాంబులు కురిపించారు.
ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే దెబ్బతీశారు. ఇక దుబాయ్‌పై కూడా దాడులు తీవ్రతరం అయ్యాయి. దుబాయ్‌లో శకలాలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. జోర్డాన్ , బహరైన్‌లపై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. అయితే వీటి ప్రభావం ఏ మేరకు ఉందనేది స్పష్టం కాలేదు. మరో వైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యవసరం అయిన హర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతి సాయుధులు ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారత జాతీయులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరికలతో ఈ జలసంధి మార్గాన్ని మూసివేశారు. అయితే ఈ ప్రాంతంలో పలు రవాణా నౌకలు యధావిధిగా తిరుగుతున్నాయి. ఖమేనీ అంతం తరువాత ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహరాన్‌పై భీకర క్షిపణి దాడులకు దిగాయి. ఆగకుండా సాగుతోన్న దాడులతో పలు ప్రాంతాలలో భయానక పరిస్థితి ఏర్పడింది.