
భారతీయ సెలబ్రిటీలు సింధు, సోనాల్ స్పందన
దుబాయ్/ న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం ఘర్షణల ప్రభావం దుబాయ్‌పై పడటంతో ఈ మహానగరంలో చిక్కుపడ్డ భారతీయ సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. తాము సురక్షితంగానే ఉన్నామని అయితే ఎప్పుడేం జరుగుతుందో అనే భయాలతో ఉండాల్సి వస్తోందని భారత్‌లోని తమ సన్నిహితులకు వాట్సాప్ సందేశాల ద్వారా తెలియచేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతతో దుబాయ్ నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు నిలిచిపోయాయి. దీనితో ప్రపంచ స్థాయి దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి ఎప్పుడు విమానాల రాకపోకలు ఆరంభమవుతాయనేది స్పష్టం కావడంలేదు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ విజేత పివి సింధు దుబాయ్‌లో చిక్కుపడ్డారు.
ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు బర్మింగ్‌హామ్‌కు ఇండోనేసియా కోచ్ ఇర్వాన్‌స్యాయ్‌తో కలిసి బయలుదేరుగా ఎయిర్‌పోర్టులో నిచిలిపోవల్సి వచ్చింది. సమీపంలోనే ఇరాన్ బాంబుల దాడి జరిగింది. దీనితో తాము పరుగులు తీశామని, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయని తెలిపారు. స్థానిక అధికారులు తమను తరువాత సురక్షిత ప్రాంతంలోని ఓ హోటల్‌కు జాగ్రత్తగా తీసుకువెళ్లారని చెప్పారు. తాము ఇప్పుడు క్షేమంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడి భారతీయ ఎంబసికి, స్థానిక అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నామని తెలిపారు. ఇక బర్మింగ్‌హామ్‌లో క్రీడా నిర్వహణపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ పరిస్థితి సమీక్షిస్తోంది. ఇక నటి సోనాల్ చౌహాన్ కూడా దుబాయ్‌లో ఉండిపోవల్సి వచ్చింది. తాను క్షేమంగా భారతదేశానికి తిరిగివచ్చేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.