Reading Time: < 1 minute

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇరాన్‌ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్ ను ముందుంచి అమెరికా సాగిస్తున్న అకారణమైన సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా ( యూనైటెడ్) ఆలిండియా కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఎంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఈ మేరకు హైదరాబాద్ ఓంకార్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీ మీదనే కాకుండా వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది హెచ్చరిక అని వారన్నారు. గతంలో వెనుజువెలా దేశ అధ్యక్షుడు మదురో పై దాడి చేసి అరెస్టు చేసి అమెరికా కస్టడీలో పెట్టుకొని ఆ దేశ సహజ వనరుల పై ఆధిపత్యం చెలాయిస్తున్న తీరు గమనించిన వారందరికీ అమెరికా – ఇజ్రాయెల్ జోడి యుద్ద ఉన్మాదం అర్థం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరించి ఇతర దేశాల సార్వభౌమత్వం లో జోక్యం చేసుకుని సాగిస్తున్న ఈ దాడులు రానున్న కాలంలో మానవ మనుగడకు పెనుముప్పు గా మారే నర ఉన్మాదం తో సాగిస్తున్న ఈ సైనిక దాడులను యావత్ ప్రపంచం, అభ్యుదయ, ప్రజా తంత్ర ప్రగతిశీల శక్తులు తీవ్రంగా ఖండిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మాణం లో ముందు వరుసలో ఉండాలని వారు పిలుపునిచ్చారు.