Reading Time: < 1 minute

90 ఏళ్ల వయసులో దలైలామాకు ‘గ్రామీ’ అవార్డు..ఆధ్యాత్మిక బోధనలకు అరుదైన గౌరవం..

Caption of Image.

68వ గ్రామీ అవార్డుల వేడుకలో 90 ఏళ్ల  ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామా  మొదటి గ్రామీ అవార్డును అందుకున్నారు. ఫిబ్రవరి 1న లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో ఆయన ఈ అవార్డు అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దలైలామా రూపొందించిన ‘మెడిటేషన్: ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ది దలైలామా’ అనే ఆడియోబుక్‌కు నేరేషన్ అండ్ స్టోరీటెల్లింగ్ విభాగంలో ఉత్తమ ఆడియో బుక్  అవార్డు లభించింది. ఇందులో ఆయన చెప్పిన శాంతి సందేశాలకు తోడుగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

 ఈ ఆడియోబుక్‌లో శాంతి, కరుణ, పర్యావరణం, మానవత్వం గురించి దలైలామా తన ఆలోచనలను పంచుకున్నారు. ప్రముఖ సరోద్ విద్వాంసుడు అమ్జాద్ అలీ ఖాన్ ఇంకా ఆయన కుమారులు అమాన్, అయాన్ ఈ ప్రాజెక్టుకు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అందించారు. ఈ విభాగంలో ట్రెవర్ నోహ్ వంటి ప్రముఖులతో దలైలామా పోటీ పడి విజేతగా నిలిచారు.

ఆగస్టు 2025లో ఈ ఆడియోబుక్ విడుదలైంది. వయస్సు రీత్యా దలైలామా స్వయంగా వేడుకకు వెళ్లలేకపోయినా, ఆయన తరపున ఇతర బృందం సభ్యులు ఈ అవార్డును అందుకున్నారు. కేవలం మతపరమైన గురువుగానే కాకుండా, తన మాటలతో ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో ఈ అవార్డు నిరూపించింది.

1989లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. ఈ వేడుకలోనే ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా  మొదటి గ్రామీని అందుకున్నారు. పాప్, రాప్ సంగీతం ఎక్కువగా వినిపించే గ్రామీ వేదికపై, దలైలామా శాంతి సందేశం వినపడటం విశేషం. దలైలామా  90వ పుట్టినరోజు తరువాత ఆగస్టు 2025లో ‘మెడిటేషన్: ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ది దలైలామా’ అనే ఆడియోబుక్ విడుదలైంది. 

©️ VIL Media Pvt Ltd.