
ఈ ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ అనేది మనలో ఒక భాగంగా మారిపోయింది. ఒక సెకన్ కూడా దాన్ని వదిలి ఉండలేని స్థితికి వచ్చాం. అయితే మీ ఫోన్‌ను ప్యాంట్ ముందు జేబులో పెట్టుకునే అలవాటు ఉందా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నుండి వెలువడే రేడియేషన్, వేడి పురుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై, ముఖ్యంగా వీర్య కణాల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ ఫోన్లు నిరంతరం రేడియో ఫ్రీక్వెన్సీ వికిరణాన్ని విడుదల చేస్తాయి. ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకోవడం వల్ల వృషణ కణజాలంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ఇది వీర్య కణాల DNAను దెబ్బతీయడమే కాకుండా వాటి చలన శక్తిని గణనీయంగా తగ్గిస్తుందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ జ్యోతి త్రిపాఠి తెలిపారు.
వేడికి గురికావడం
ఆరోగ్యకరమైన వీర్య కణాల ఉత్పత్తికి వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుండి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఎక్కువ గంటలు ఉంచడం వల్ల ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ స్వల్ప మార్పు కూడా శుక్రకణాల సాంద్రతను తగ్గించి వంధ్యత్వానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్చుకోదగిన అలవాటే.. ఆందోళన వద్దు
సంతానలేమికి కేవలం ఫోన్ ఒక్కటే కారణం కాదని.. ధూమపానం, మద్యపానం, ఒత్తిడి మరియు సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి అంశాలు కూడా తోడవుతాయని డాక్టర్ మధు పాటిల్ తెలిపారు. అయితే ఫోన్ జేబులో పెట్టుకోవడం అనేది మనం సులభంగా మార్చుకోగల అలవాటు. ‘‘శరీరం ప్రతి మూడు నెలలకు ఒకసారి వీర్య కణాల నిల్వను పునరుద్ధరించుకుంటుంది. కాబట్టి అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ నష్టాన్ని త్వరగానే అధిగమించవచ్చు’’ అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు
- ఫోన్‌ను ప్యాంట్ జేబులో కాకుండా జాకెట్ జేబులో లేదా బ్యాగ్‌లో ఉంచుకోండి.
- కాల్స్ మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు హ్యాండ్స్-ఫ్రీ లేదా ఇయర్ ఫోన్స్ వాడండి.
- అనవసరంగా ఎక్కువ సేపు మొబైల్ వాడటం తగ్గించండి.
- సరైన వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.