Reading Time: < 1 minute

ఈసారి మాత్రం మూములుగా ఉండదు: అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్

Caption of Image.

టెహ్రాన్: ఇరాన్‎తో జగడం మరింత ముదురుతుండటంతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికిని పెంచుతోంది. ఇజ్రాయెల్, గల్ఫ్ వైపు భారీగా యుద్ధ విమానాలు, నౌకలు, అదనపు బలగాలను తరలిస్తోంది. ఇరాన్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఏ క్షణమైనా దాడులు చేసేందుకు అగ్ర రాజ్యం సిద్ధమవుతోంది. అమెరికా చర్యలతో మరోసారి ఇరాన్, యూఎస్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అమెరికా ఇరాన్‏పై ఏదైనా దాడి చేస్తే మాత్రం పరిస్థితి మూములుగా ఉండదని హెచ్చరించారు. 

ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ భయపడదని స్పష్టం చేశారు. ‘‘అమెరికన్లు ఈసారి యుద్ధం ప్రారంభిస్తే అది ప్రాంతీయ యుద్ధం అవుతుందని వారు తెలుసుకోవాలి. ట్రంప్ బెదిరింపులకు ఇరానియన్లు భయపడకూడదు’’ అని ఖమేనీ అన్నారు. ఇరాన్‎లో చెలరేగిన అల్లర్లలో అమెరికా, ఇతర దేశాల ప్రమేయం ఉందనే ఆరోపణలను పునరుద్ఘాటించారు. అల్లర్లను ఇరాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి విదేశీ శత్రువులు చేసిన కుట్రగా అభివర్ణించారు.

ఇటీవల ఇరాన్‎లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులను ఖమేనీ సర్కార్ ఉక్కుపాదంతో అణివేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని పిట్టల్లా కాల్చి చంపింది. నిరసనకారులపై ఖమేనీ ప్రభుత్వ మారణకాండను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనకారులపై బల ప్రయోగం చేస్తే మేం రంగంలోకి దిగాల్సి వస్తోందని ఇరాన్‎ను హెచ్చరించారు. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. 
 

©️ VIL Media Pvt Ltd.