Reading Time: 2 minutes

బడ్జెట్ 2026: విదేశీ ఆస్తులున్న వారికి బంపర్ ఆఫర్.. జరిమానా లేకుండా వివరాలు వెల్లడించే ఛాన్స్!

Caption of Image.

విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం చేసే ఐటీ ఉద్యోగులు, ఎన్నారైల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. విదేశాల్లో సంపాదించిన ఆస్తులు లేదా ఆదాయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయకపోతే జరిమానా లేకుండా వాటిని వెల్లడించే అవకాశం ఈ పథకం  కల్పిస్తుంది.

ఈ పథకం ఎవరి కోసం?
చాలా మంది విద్యార్థులు లేదా ఉద్యోగులు విదేశాల్లో ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ తెరవడం, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం లేదా కంపెనీలు ఇచ్చే షేర్లు (ESOPs) పొందడం జరుగుతుంది. ఇండియాకు తిరిగి వచ్చాక, వీటి వివరాలను ట్యాక్స్ రిటర్నులో చెప్పడం మర్చిపోతుంటారు. ఇలాంటి చిన్న పన్ను చెల్లింపుదారుల చిక్కులను తొలగించడానికి ఈ పథకం తెచ్చారు.

ఈ పథకంలోని రెండు రకాలు ఉన్నాయి. వర్గం ‘ఎ’ అంటే రూ. 1 కోటి వరకు ఆస్తులు ఉన్నవారు. విదేశీ ఆస్తులను అసలు వెల్లడించని వారు ఈ కేటగిరీ కిందకు వస్తారు. వీరు ఆ ఆస్తి విలువపై 30% పన్ను, జరిమానాకు బదులుగా 30% అదనపు పన్ను చెల్లించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు.

వర్గం ‘బి’ అంటే రూ. 5 కోట్ల వరకు ఆస్తులు ఉన్నవారు. విదేశీ ఆదాయంపై పన్ను చెల్లించి, ఆ వివరాలను వెల్లడించినప్పటికీ, ఆ ఆస్తి వివరాలను సరిగ్గా చెప్పని వారు ఈ కేటగిరీలోకి వస్తారు. వీరు కేవలం రూ. 1 లక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వీరికి జరిమానా, శిక్షల నుండి పూర్తి మినహాయింపు లభిస్తుంది.

ALSO READ : టాక్స్ హాలీడే.. డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపు

అది కూడా ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుండి 6 నెలల పాటు వివరాలు వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. నేరాల ద్వారా సంపాదించిన నల్లధనానికి ఈ పథకం వర్తించదు. కేవలం పొరపాటున వెల్లడించని సాధారణ ఆదాయానికి మాత్రమే ఈ పథకం  వర్తిస్తుంది.

ప్రస్తుతం వివిధ దేశాల మధ్య సమాచార మార్పిడి పెరగడం వల్ల విదేశీ ఆస్తులను దాచడం కష్టం. కాబట్టి, ముందే వెల్లడించి శిక్షల నుండి తప్పించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ పథకం 2026 ఆర్థిక బిల్లులో భాగంగా అమలులోకి వస్తుంది.

©️ VIL Media Pvt Ltd.