
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి చేతులు కలుపుతుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పా 1, 2 లతో సుకుమార్ క్రేజ్ టాలీవుడ్ సరిహద్దులను దాటి పాన్ ఇండియా లెవల్‌కి చేరుకోగా.. ఆర్ఆర్ఆర్, పెద్ది వంటి చిత్రాలతో మెగాపవర్ స్టార్ గ్లోబల్ రేంజ్‌లో ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకున్నారు. ఇలాంటి టైంలో మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పని చేస్తుండటంతో ఈ కొత్త సినిమాపై మెగా ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి బయటకు వచ్చిన సరికొత్త న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సుకుమార్ సినిమా అంటే కళ్లు మూసుకుని గుర్తుకొచ్చే పేరు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. కానీ ఈసారి సుక్కూ తన ఆస్థాన సంగీత దర్శకుడికి షాకిస్తూ, సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను రంగంలోకి దించుతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అనిరుధ్ పేరు ఒక బ్రాండ్‌గా మారారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. సుకుమార్ రా అండ్ ఇంటెన్స్ మేకింగ్‌కు తోడు అనిరుధ్ బీజీఎం తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ లెక్కన సుకుమార్-అనిరుధ్ కాంబినేషన్ మూవీ లవర్స్‌కు నిజంగానే పూనకాలు తెప్పించే ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడే సినీ ప్రియుల మనసులో ఒక చిన్న వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఆర్య’ నుంచి మొదలుపెడితే ‘జగడం’, ‘ఆర్య 2’, ‘1: నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ మీదుగా పాన్-ఇండియా సంచలనం ‘పుష్ప 1, 2’ వరకు సుకుమార్ ఆలోచనలకు ప్రాణం పోసింది దేవిశ్రీనే. సుక్కూ ఏం కోరుకుంటారో డీఎస్పీకి కొట్టినపిండి.. డీఎస్పీ ట్యూన్‌లకు సుకుమార్ తెరపై ఇచ్చే విజువల్ ట్రీట్ మరో లెవెల్. వీరిద్దరిది కేవలం దర్శకుడు – సంగీత దర్శకుడి బంధం మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత సక్సెస్ ఫుల్ కాంబినేషన్లలో ఒకటి.
రామ్ చరణ్‌తో గతంలో వచ్చిన ‘రంగస్థలం’లో దేవిశ్రీ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాయి. మరి అలాంటి వీరి కాంబోకు ఈసారి బ్రేక్ పడటం, సుకుమార్ దేవిశ్రీని పక్కనపెట్టి అనిరుధ్ వైపు వెళ్లడం అభిమానులకు కొంత బాధాకరమైన విషయమే. పాన్-ఇండియా మార్కెట్ విస్తరణలో భాగంగా గ్లోబల్ ఆడియన్స్‌కు సరికొత్త సౌండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారా లేదంటే, ‘ఎల్లమ్మ’తో హీరోగా ఎంట్రీ ఇస్తూ బిజీగా ఉన్న దేవిశ్రీకి ఈ ప్రాజెక్ట్‌కు కేటాయించేంత సమయం లేకనే ఈ మార్పు జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. అనిరుధ్ రాక ఈ సినిమాకు కొత్త వైబ్ తెస్తుందనడంలో సందేహం లేదు. కానీ దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుక్కూ-డీఎస్పీ మ్యాజిక్ మిస్సవుతుండటం మాత్రం అందరిలోనూ ఒక ఎమోషనల్ చర్చకు తెరలేపింది.