Reading Time: 2 minutes
Rajinikanth Jailer 2 Reason Baashha 2 Petta 2

Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన క్లాసిక్ సినిమాలకు కొదవే లేదు. ముఖ్యంగా ‘బాషా’, ‘పేట’ చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు రజనీ చుట్టూ తిరిగారు. కానీ, తలైవా మాత్రం ఆ ప్రాజెక్ట్‌లకు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పారు. అలాంటిది.. అనౌన్స్ చేసిన క్షణం నుంచే బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న ‘జైలర్ 2’కి మాత్రం ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారు? కేవలం రికార్డు కలెక్షన్లు వచ్చాయనే ఉద్దేశంతోనే ఈ సీక్వెల్‌కు ఒప్పుకున్నారా? అంటే.. కానే కాదట. అసలు ట్విస్ట్ కథలోనే దాగుందని చెబుతున్నారు.

తాజాగా నిర్వహించిన జైలర్ 2 సూపర్ షో కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ జైలర్‌కి సీక్వెల్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ‘‘జైలర్’ ఘనవిజయం సాధించిన తర్వాత, ఓటీటీలో ఆ సినిమాను మళ్లీ చూసినప్పుడు.. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే భారీ స్మగ్లింగ్ నెట్‌వర్క్ తాలూకు క్లూ నన్ను ఆకట్టుకుంది. కథ అక్కడ ముగిసిపోలేదని, దానికి సహజమైన కొనసాగింపు స్పష్టంగా ఉందని అప్పుడే గ్రహించారు. ఆ వెంటనే డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌కు స్వయంగా ఫోన్ చేసి, “సీక్వెల్ కథ ఈ సినిమాలో ఇన్-బిల్ట్‌గా ఉంది.. మనం రెండో భాగం చేస్తున్నాం” అని చెప్పి స్వయంగా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాను’ అని సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. కేవలం హిట్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం కాకుండా, కథ డిమాండ్ చేయడం వల్లే ‘జైలర్ 2’ పుట్టిందని ఈ సందర్భంగా రజనీ స్పష్టం చేశారు.

ఈ పవర్‌ఫుల్ సీక్వెల్‌లో విశ్రాంత జైలర్ ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఒక శక్తివంతమైన అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ముత్తువేల్ ఓ సాధారణ డ్రైవర్ అవతారంలో అండర్‌కవర్ ఆపరేషన్ మొదలుపెడతాడట. ఆయన గత జీవితం, పాత క్రైమ్ నెట్‌వర్క్ లింకులతో ఈసారి స్క్రీన్‌ప్లే మరింత వైల్డ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీ సరసన రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ తమ పాత పాత్రలను కొనసాగిస్తున్నారు. ఇక కొత్తగా ఎస్.జె. సూర్య, విద్యాబాలన్, బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి, మలయాళ విలక్షణ నటుడు సూరజ్ వెంజారమూడు జాయిన్ అయ్యి సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేశారు. వీరికి తోడుగా మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌లతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక కామియోల్లో మెరవనున్నట్లు తెలుస్తుంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బీజీఎంతో, దర్శకుడు నెల్సన్ డార్క్ హ్యూమర్-యాక్షన్ కలయికతో ‘జైలర్ 2’ దసరా బరిలో అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. కథా బలంపై పూర్తి నమ్మకంతో తలైవా ఓకే చెప్పిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.