Reading Time: 2 minutes
Dhruv Rathee Kidnapping Allegation Delhi Police

Dhruv Rathee: పోలీసులు తనను కేవలం అదుపులోకి తీసుకోలేదని, ఏకంగా కిడ్నాప్ చేశారని ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆరోపించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో తలపెట్టిన ‘జంతర్ మంతర్ 2.0’ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న క్రమంలో శనివారం (అక్టోబర్ 10న) గుర్గావ్‌లోని తన నివాసం నుంచి ఢిల్లీ పోలీసులు రాఠీని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసుల కస్టడీ నుంచి విడుదలైన తర్వాత ధ్రువ్ రాఠీ ఆదివారం తొలిసారి స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. “నేను నా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో నన్ను అపహరించడానికి గుండాలను పంపించారు” అని ఆరోపించారు.

ఈ వీడియోలో బీజేపీ తీరును తీవ్రంగా విమర్శించే రాఠీ.. తాను కస్టడీలో ఉన్న సమయంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తన పౌరసత్వంపై సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ.. తన ఇండియన్ పాస్‌పోర్ట్‌ను కెమెరా ముందుకు తెచ్చి చూపించారు. “ఇదిగో నా పాస్‌పోర్ట్.. నేను భారత పౌరుడినే, ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటాను” అని స్పష్టం చేశారు. సీజేపీ ఆందోళనలో తాను పాల్గొనకుండా అడ్డుకోవడానికి, తన అరెస్టును సమర్థించుకోవడానికి కొందరు కావాలనే తనపై అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. తనకు విదేశీ పౌరసత్వం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని, ఒక సాధారణ భారతీయ పౌరుడిగా భారత్‌లో జరిగే నిరసనల్లో పాల్గొనే హక్కు తనకు పూర్తిస్థాయిలో ఉందని రాఠీ తేల్చి చెప్పారు.

తనను అరెస్ట్ చేసిన విధానాన్ని వివరిస్తూ.. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాను నిద్రపోతున్న సమయంలో దాదాపు 20 మంది సాదాసీదా దుస్తుల్లో వచ్చి తన ఇంట్లోకి ప్రవేశించారని చెప్పారు. వారు ఎవరో అడిగే లోపే తనను తీసుకెళ్లిపోయారని, దాదాపు 22 నుంచి 23 గంటల పాటు వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఫోన్‌ను లాక్కున్నారన్నారు. బెడ్‌రూమ్ నుంచి తనను బలవంతంగా బయటకు తీసుకెళ్తున్న సమయంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత శనివారం అర్ధరాత్రి దాటాక, ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయనను విడుదల చేశారు. మరోవైపు, పోలీసులు విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ధ్రువ్ రాఠీ మళ్లీ జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయనపై మళ్లీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు తెలిపాయి.