
జగిత్యాల: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను లిఫ్ట్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడిన ఆయనకు, తాజాగా జగిత్యాలలో మరోసారి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓ ప్రైవేట్ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాలలోని ఓ ప్రైవేట్ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ముందుగా లిఫ్ట్‌లో పై అంతస్తుకు చేరుకున్నారు. అనంతరం రెండోసారి లిఫ్ట్ పైకి వెళ్తుండగా, అది ఒక్కసారిగా వేగంగా కిందకు పడిపోయినట్లు సమాచారం.ఆ సమయంలో లిఫ్ట్‌లో మంత్రి వెంట పలువురు ముఖ్య నాయకులు, గన్‌మెన్లు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గతంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లిఫ్ట్ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఆ ఘటన మరువకముందే జగిత్యాలలో మరోసారి లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు గల కారణాలు, లిఫ్ట్‌లో సాంకేతిక లోపం ఉందా అనే విషయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.