
చెన్నై నగర ప్రజలకు గుడ్ న్యూస్. చెన్నై మెట్రో రైలు సెకండ్ ఫేజ్ లో భాగంగా, పూనమల్లి నుంచి వడపళని వరకు నిర్మించిన కొత్త మెట్రో మార్గం ప్రారంభమైంది. ఈ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,తమిళనాడు సీఎం విజయ్ తో కలిసి ప్రారంభించారు. సుమారు4 వేల900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ మెట్రో మార్గం దాదాపు 15 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇందులో 11 ఎత్తైన మెట్రో స్టేషన్లు ఉన్నాయి.
ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో చెన్నై పశ్చిమ ప్రాంతాల నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం మరింత సులభం కానుంది. ముఖ్యంగా రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్టు వివరాలను అధికారులు వారికి వివరించారు.
ఈ మార్గంలో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు, భవిష్యత్తులో డ్రైవర్‌లెస్ రైళ్ల నిర్వహణకు అనువైన సాంకేతిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారిడార్‌లో సుమారు 3.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.