Reading Time: 4 minutes
Lunch Recipes Delicious Vegetarian Dishes For Unexpected Guests

Lunch Recipes: భారతీయ సంప్రదాయంలో ఇంటికి వచ్చే అతిథులను దైవంతో సమానంగా భావిస్తాం. మన ఇంటికి చుట్టాలు, స్నేహితులు వస్తున్నారంటే చాలు.. వారిని ఆప్యాయంగా పలకరించడంతో పాటు, కడుపునిండా కమ్మని భోజనం పెట్టి పంపించడమే మన ప్రాధాన్యత. విందు భోజనం అంటే రకరకాల నాన్-వెజ్ వంటకాలే ఉండనక్కర్లేదు.. సంప్రదాయబద్ధంగా వంటింట్లో లభించే కూరగాయలతో చేసే శాకాహార వంటకాలు కూడా అమృతంలా ఉంటాయి. కానీ అతిథులు వచ్చిన వేళ వంటింట్లోనే ఎక్కువ సమయం గడిపేస్తే వారితో సరదాగా గడిపే సమయం దొరకదు. అందుకే పెద్దగా హడావుడి లేకుండా, వంటింట్లో ఉండే సాధారణ మసాలాలతోనే ఘుమఘుమలాడేలా చిటికెలో సిద్ధం చేసుకునే వివిధరకాల కూరలు, రోటి పచ్చళ్ల రెసిపీలు ఎలా చేయాలో చూసేద్దామా..

పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి

కావలసిన పదార్థాలు:

* టమాటాలు – 4 (బాగా పండినవి)
* పచ్చిమిర్చి – 12 నుండి 15
* ధనియాలు – 2 టీస్పూన్లు
* జీలకర్ర – 1 టీస్పూన్
* ఆవాలు – 1/2 టీస్పూన్
* మెంతులు – 1/4 టీస్పూన్
* వేయించిన నువ్వుల పొడి – 1 టేబుల్ స్పూన్
* వెల్లుల్లి రెబ్బలు – 5 నుండి 6
* ఉల్లిపాయ – 1 (మీడియం సైజు)
* చింతపండు – కొద్దిగా
* కరివేపాకు – 1 రెమ్మ
* పసుపు – 1/4 టీస్పూన్
* ఉప్పు, నూనె – తగినంత

తయారీ విధానం:

పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి తుంచిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి మెత్తగా మగ్గనిచ్చి చల్లార్చాలి. వేయించిన ధనియాలు-జీలకర్ర మిశ్రమాన్ని రోట్లో లేదా మిక్సీలో పొడి చేసుకుని, అందులో పచ్చిమిర్చి, చింతపండు వేసి దంచాలి. దీనికి నువ్వుల పొడి, మగ్గించిన టమాటాలు, పచ్చి వెల్లుల్లి రెబ్బలు కలిపి నూరుకోవాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచి గిన్నెలోకి తీసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇది అద్భుతంగా ఉంటుంది.

పాల సొరకాయ కూర

కావలసిన పదార్థాలు:

* లేత సొరకాయ – 400 గ్రాములు
* కాచిన చిక్కటి పాలు (మీగడతో సహా) – 1.5 కప్పులు
* ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి – 10 నుండి 12
* వెల్లుల్లి రెబ్బలు – 5 నుండి 6
* జీలకర్ర – 1 టీస్పూన్
* తాలింపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు) – 1 టేబుల్ స్పూన్
* పసుపు – 1/2 టీస్పూన్
* కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
* ఉప్పు, నూనె – తగినంత

తయారీ విధానం:

లేత సొరకాయను తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి పోపు దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. ఇందులో సొరకాయ ముక్కలు వేసి నీళ్లు పోయకుండా మూతపెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక సిద్ధం చేసిన పచ్చికారం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత మీగడతో కూడిన చిక్కటి పాలు పోసి మూత పెట్టకుండా సిమ్‌లోనే ఉడికించాలి. పాలు ఇగిరిపోయి కూర చిక్కటి ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

ఆంధ్ర స్టైల్ వంకాయ గుజ్జు కూర

కావలసిన పదార్థాలు:

* వంకాయలు – పావు కేజీ
* టమాటాలు – 2
* ఉల్లిపాయలు – 2
* చింతపండు – ఉసిరికాయ సైజు అంత
* కారం – 2 టీస్పూన్లు
* ధనియాల పొడి – 1.5 టీస్పూన్లు
* జీలకర్ర పొడి – 1/4 టీస్పూన్
* మెంతులు – 2 చిటికెళ్ళు
* ఇంగువ – 2 చిటికెళ్ళు
* తాలింపు దినుసులు – 1 టేబుల్ స్పూన్
* వెల్లుల్లి రెబ్బలు – 4 నుండి 5
* ఎండుమిర్చి – 2 నుండి 3
* పచ్చిమిర్చి – 3
* పసుపు – 1/4 టీస్పూన్
* కరివేపాకు, కొత్తిమీర – తగినంత
* ఉప్పు, నూనె – తగినంత

తయారీ విధానం:

వంకాయలను పొడవుగా కోసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఇంగువ, వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. కాసేపటికి టమాటా ముక్కలు కూడా చేర్చి మూతపెట్టి మెత్తగా మగ్గనిచ్చి చల్లార్చి, మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వేరే బాండీలో నూనె వేసి మెంతులు ఎర్రగా వేయించి, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. అందులో గ్రైండ్ చేసిన వంకాయ పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి నూనె పైకి తేలేవరకు లో ఫ్లేమ్‌లో మగ్గించి దింపేయాలి.

బంగాళదుంప పచ్చిమిర్చి కూర

కావలసిన పదార్థాలు:

* బంగాళదుంపలు – 400 గ్రాములు (3 పెద్దవి)
* ఉల్లిపాయలు – 2 (పొడవుగా తరిగినవి)
* పచ్చిమిర్చి – 10 (కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయడానికి) + 4 (తాలింపు కోసం)
* వెల్లుల్లి రెబ్బలు – 4 నుండి 5
* జీలకర్ర – 1 టీస్పూన్
* ధనియాల పొడి – 1 టీస్పూన్
* పోపు దినుసులు – 1 టేబుల్ స్పూన్
* పసుపు – 1/4 టీస్పూన్
* కరివేపాకు – 2 రెమ్మలు
* ఉప్పు, నూనె – సరిపడా

తయారీ విధానం:

బంగాళదుంపలను సగానికి కట్ చేసి కుక్కర్‌లో కొద్దిగా ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, పొట్టు తీసి మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీలో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. బాండీలో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి చీలికలు, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, పసుపు వేసి రెండు నిమిషాలు వేగాక, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి వేసి కలపాలి. ముక్కలు చిదగకుండా గరిటెతో జాగ్రత్తగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించి దింపేస్తే ఎంతో రుచికరమైన ఆలూ కూర సిద్ధమవుతుంది.

తోటకూర టమాటా పచ్చికారం కూర

కావలసిన పదార్థాలు:

* తోటకూర – 5 కట్టలు
* టమాటాలు – 3 (బాగా పండినవి)
* ఉల్లిపాయలు – 2 (పొడవుగా తరిగినవి)
* పచ్చిమిర్చి – 10
* వెల్లుల్లి రెబ్బలు – 5 నుండి 6
* జీలకర్ర – 1/2 టీస్పూన్
* ధనియాల పొడి – 1 టీస్పూన్
* ఎండుమిర్చి – 2
* పోపు దినుసులు – 1 టేబుల్ స్పూన్
* పసుపు – 1/4 టీస్పూన్
* కరివేపాకు – 1 రెమ్మ
* ఉప్పు, నూనె – సరిపడా

తయారీ విధానం:

శుభ్రం చేసుకున్న తోటకూరను సన్నగా తరగాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర కలిపి మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. బాండీలో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అందులోనే సిద్ధం చేసుకున్న పచ్చికారం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన తోటకూర, టమాటా ముక్కలు వేసి కలపాలి. నీళ్లు ఏమీ పోయకుండా మూతపెట్టి టమాటా, ఆకుకూరలోని సహజమైన నీటితోనే మగ్గనివ్వాలి. కూర సగం ఉడికాక ఉప్పు, పసుపు, చివరగా ధనియాల పొడి వేసి నూనె తేలేవరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి.

కాలీఫ్లవర్ వేపుడు

కావలసిన పదార్థాలు:

* కాలీఫ్లవర్ – 1 (సుమారు 400 గ్రాములు)
* ఉల్లిపాయ – 1
* పచ్చిమిర్చి – 2
* పోపు దినుసులు – 1 టేబుల్ స్పూన్
* కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
* పసుపు, ఉప్పు, నూనె – తగినంత

కారప్పొడి కోసం:

* కారం – 1.5 టీస్పూన్లు
* పచ్చి నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
* ధనియాలు – 1 టీస్పూన్
* జీలకర్ర – 1/2 టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు – 6

తయారీ విధానం:

కాలీఫ్లవర్ ముక్కలను మరిగే ఉప్పు, పసుపు నీళ్లలో పది నిమిషాలు ఉంచి వడకట్టాలి. మిక్సీ జార్‌లో కారం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, పచ్చి నువ్వులు వేసి పొడి చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాలీఫ్లవర్ ముక్కలను మీడియం మంటపై దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. చివరగా తయారుచేసి పెట్టుకున్న నువ్వుల కారప్పొడి వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేయించి కొత్తిమీర చల్లుకోవాలి.