
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలకు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శంఖారావం పూరించారు. రంపచోడవరం మండలం కాకవాడలో ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజనులు, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని, అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసైనికులు ఎంతో త్యాగం చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు పదవులను ఆశించకుండా కూటమి కోసం పనిచేస్తున్న జనసైనికుల త్యాగాలను గుర్తించాలని అన్నారు. కూటమిలోని మూడు పార్టీలూ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. స్థానికంగా కూటమి మరింత బలపడితే గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. జనసైనికులు, వీరమహిళలు సమన్వయంతో పనిచేస్తూ కూటమిని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో వీరమహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం త్రికరణశుద్ధిగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి కంటే శిలాఫలకాలు, రంగులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం క్షేత్రస్థాయిలో అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని పేర్కొన్నారు.
పర్యటనలో భాగంగా రాకోట గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రచ్చబండపై కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు ఆయనను కోరారు. సినిమాల్లో మాత్రమే చూసిన పవన్ కళ్యాణ్ తమ గ్రామానికి స్వయంగా రావడం నమ్మలేకపోతున్నామని పలువురు గిరిజనులు భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఆరోగ్యం బాగోలేదని తెలిసిందని, ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటూ పవన్ కళ్యాణ్‌ను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.