
పుణెలోని పింప్రి-చించ్‌వాడ్‌లో వైసీఎం (YCM) ఆసుపత్రికి చెందిన కదులుతున్న అంబులెన్స్ నుంచి ఒక రోగి కిందపడిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పింప్రిలోని యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్ (వైసీఎంహెచ్) అంబులెన్స్ రోగితో వెళ్తుండగా, అకస్మాత్తుగా అంబులెన్స్ డోర్ తెరుచుకుని రోగి స్ట్రెచర్‌తో సహా రోడ్డుపై పడిపోయాడు. ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికులు మొబైళ్లలో రికార్డు చేశారు.
ప్రజల ఆగ్రహం
రోగి రోడ్డుపై పడిపోవడం చూసిన స్థానికులు వెంటనే అంబులెన్స్ డ్రైవర్‌ను అడ్డుకొని నిలదీశారు. వాహనం కదలడానికి ముందు తలుపులు సరిగ్గా లాక్ చేశారా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం అందులో ఉన్న రోగికి పెద్దగా గాయాలు కాలేదని, వెంటనే తిరిగి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఆసుపత్రి భద్రతపై తీవ్ర ప్రశ్నలు
ఈ ఘటన వైద్య రవాణాలో భద్రతా లోపాలను బయటపెట్టింది. అంబులెన్స్ డోర్స్ సరిగ్గా లాక్ చేశారా? స్ట్రెచర్‌ను సురక్షితంగా కట్టారా లేదా? రోగితో పాటు మెడికల్ అసిస్టెంట్ ఉన్నారా ? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
వైసీఎం ఆసుపత్రి
వైసీఎం ఆసుపత్రి పీసీఎంసీ (PCMC) ఆధ్వర్యంలో నడిచే 750 పడకల పెద్ద ఆసుపత్రి. ఇలాంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో రోగులను సురక్షితంగా తరలించడంలో జరిగిన ఈ పొరపాటుపై అధికారిక విచారణ జరిగి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.