Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం: పరమేశ్వరుడు పార్వతికి చెప్పినది ఇదే..!ఇతరుల హితాన్ని కోరుకోవాలి..పావురాలు వేటగాడికి ఎలా సాయపడ్డాయో తెలుసా..!

Caption of Image.

పరహితము సేయు నెవ్వడు
పరమ హితుండగును భూత పంచకమునకున్‌
బరహితమె పరమ ధర్మము
పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖీ 
అంటాడు పోతన భాగవతంలో. 

ఎవరు ఇతరులకు సహాయం చేస్తారో వారు పంచభూతాలకు ప్రీతిపాత్రులవుతారు. పరులకు సేవ చేయడమే అన్ని ధర్మాలలోను ఉత్తమమైనది. పరులకు హితము చేసేవారికి ఎక్కడా ఎదురు ఉండదు. అటువంటివారిని లోకులు కీర్తిస్తారు.

ఈ మాటలను సాక్షాత్తు పరమ శివుడు పార్వతీదేవితో పలికాడని పోతన చెప్తున్నాడు. క్షీరసాగర మథనం సమయంలో సముద్రం నుంచి వెలువడిన హాలాహలం చూసి అందరూ భయపడుతుంటే, పరమేశ్వరుడు ఆ హాలాహలం మింగి, తన గళంలో బంధించాడు. 

ఆ సమయంలో పార్వతీదేవితో, ‘ఓ చంద్రబింబం వంటి ముఖం కలిగిన పార్వతీ! అన్ని ధర్మాలలోకి ఇతరులకు సహాయపడడం అనేది గొప్ప ధర్మం. మనం ఇతరులకు సహాయం చేస్తే ఎవరో ఒకరు మనకు తప్పక సహాయపడతారని పలికాడు. ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల సేవాభావంతో మెలగడం అలవాటు చేసుకోవాలని ఈ పద్యం ద్వారా పోతన చెప్తున్నాడు. 

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక దేవాలయం ఉంది. ఆ ఆలయ పూజారి మహాజ్ఞాని. అతని పట్ల ఆ ఊరి ప్రజలంతా ఎంతో గౌరవంగా మెలిగేవారు. కొంతకాలానికి ఆయన వృద్ధుడు కావడంతో మరణానికి సమీపించాడు. అప్పుడు ఆ గ్రామ ప్రజలను పిలిచి, నా తరువాత ఒక మంచి మానవుడిని ఆలయ పూజారిగా నియమించండి అని చెప్పి, కన్నుమూశాడు. 

ఆలయపూజారి పదవి ఖాళీగా ఉందని తెలిసి ఎంతోమంది ఆ పదవి కోసం ప్రయత్నించారు. ఆ గ్రామానికి రావాలంటే ముళ్లు, రాళ్లు, గోతులు వంటివి దాటి రావాలి. ఒకరోజు ఒక యువకుడు వచ్చాడు. అతడిని చూసి, ‘ఏమిటి ఈ అవతారం. ఒంటి నిండా గాయాలున్నాయి. బట్టలన్నీ చిరిగిపోయాయి’ అని ప్రశ్నించారు. అందుకు ఆ యువకుడు, ‘అయ్యా! నేను వచ్చేదారి అంతా ముళ్లతోను, రాళ్లతోను, గోతులతోను నిండి ఉంది. నేను ఆ మార్గమంతా శుభ్రం చేసుకుంటూ వచ్చాను. నా గాయాలకు కాస్తంత మందు రాసుకుని, తగ్గిపోయాక వెళ్లిపోతాను’ అన్నాడు.

 గ్రామప్రజలు ఆ యువకుడి మాటలకు ఆశ్చర్యపోయారు. ఇప్పటికి ఎంతోమంది ఈ ఊరు వచ్చారు. వారంతా ఆ ముళ్లకంపలు దాటుకుంటూనే వచ్చారు. కాని ఈ యువకుడు మాత్రం మన గ్రామప్రజలందరికీ ఉపయోగపడేలా దారిని శుభ్రం చేశాడు. మన పూజారి ఇటువంటి వ్యక్తినే తన వారసునిగా రావాలని కోరుకున్నాడు. కనుక ఈ రోజు నుండి ఇతడే మన దేవాలయానికి పూజారి అని నిర్ధారించారు. 

అడవిలో ఒక చెట్టు మీద పక్షుల జంట నివసిస్తోంది. అవి ఇంటికి వచ్చిన అతిథిని సేవించుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఒకరోజు ఆడ పావురం ఆహారం కోసం అడవిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆ అడవిలో  పక్షులను వేటాడుతున్న ఒక వేటగాడికి ఆడ పావురం చిక్కింది. దానిని బోనులో బంధించాడు. అదే సమయంలో గాలివాన మొదలైంది. 

చలితో వణికిపోతున్న వేటగాడు ఆశ్రయం కోసం ఆ పావురాలు నివసించే చెట్టు కిందకు చేరాడు. చెట్టు మీద ఉన్న మగ పావురం, ‘అయ్యో పెద్ద వాన పడుతోంది. నా భార్య ఇంకా రాలేదు’ అని ఆందోళన చెందుతోంది. చెట్టు క్రింద బోనులో ఉన్న భార్య తన భర్త మాటలు విని, ‘ప్రాణనాథా! ఇక్కడ చలితో వణుకుతున్న వేటగాడు ఉన్నాడు. 

అతడు మనకు అతిథి. నన్ను బంధించాడని కోపగించుకోకుండా అతనికి ఆతిథ్యం ఇవ్వడం నీ ధర్మం‘ అని పలికింది. మగ పావురం బోయవాడిని ఆదరించింది. చలి కాచుకోవడానికి నిప్పు వెలిగించింది. అతడి ఆకలి తీర్చాలనుకుంది. 

తన దగ్గర ఎటువంటి ఆహారపదార్థాలు లేకపోవడంతో, ‘నేనే నీకు ఆహారం అవుతాను‘ అంటూ ఆ మంటలో దూకి తన ప్రాణాలను అర్పించింది. అది చూసి చలించిపోయిన బోయవాడు..  బోనులో ఉన్న ఆడ పావురాన్ని విడిచిపెట్టాడు. తన భర్త మరణాన్ని తట్టుకోలేక ఆ ఆడ పావురం కూడా అదే మంటల్లో దూకి ప్రాణత్యాగం చేసింది. ఈ పక్షుల త్యాగానికి మెచ్చి దేవతలు వాటికి ఉత్తమ లోకాలను ప్రసాదించారు. 

–  డా. పురాణపండ వైజయంతి –

గమనిక:  మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీ పత్రంతో పాటు featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.

©️ VIL Media Pvt Ltd.