Reading Time: < 1 minute
Epfo Form 121 Pf Withdrawal Tds Exemption 2026 27

EPFO Update: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఒక కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. పన్ను సంవత్సరం (Tax Year) 2026-27 నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునేటప్పుడు టీడీఎస్ మినహాయింపు కోసం ఉపయోగించే ఫారమ్ 15G, ఫారమ్ 15Hలు ఇకపై చెల్లవని స్పష్టం చేసింది. వీటి స్థానంలో ఇన్కమ్ టాక్స్ యాక్ట్, 2025 ప్రకారం టీడీఎస్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవడానికి ఇకపై ఫారమ్ 121 సమర్పించడం తప్పనిసరి అని వెల్లడించింది. ఈ విషయాన్ని ఇపిఎఫ్ఓ తన అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంది. ఇప్పటివరకు పీఎఫ్ నుంచి డబ్బులు తీసే సమయంలో పన్ను మినహాయింపు కోసం నివాస పన్ను చెల్లింపుదారులు తమ వయస్సు, అర్హతను బట్టి ఫారమ్ 15G లేదా 15Hలలో ఒకదాన్ని ఎంచుకునేవారు. సాధారణంగా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, వారి మొత్తం అంచనా ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉన్నవారు ఫారమ్ 15Gని వాడేవారు. అదే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఫారమ్ 15H ద్వారా మినహాయింపు పొందేవారు. అయితే పన్ను సంవత్సరం 2026-27 నుంచి ఈ రెండు ఫారమ్‌లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.

ఈ రెండు వేర్వేరు ఫారమ్‌ల స్థానంలో ఒకే ఒక్క ఫారమ్ 121ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది తప్ప, దీనివల్ల కొత్తగా ఎలాంటి పన్ను భారం పడదు. సబ్‌స్క్రైబర్లు ఏ ఫారమ్ ఎంచుకోవాలనే అయోమయం లేకుండా సులువుగా మినహాయింపు పొందేందుకు ఇది సహాయపడుతుంది. అయితే ఈ ఫారమ్ 121 సమర్పించినంత మాత్రాన మీరు డ్రా చేసే పీఎఫ్ సొమ్ము ఆటోమేటిక్‌గా పన్ను రహితం (Tax-Free) అయిపోదు. ఆ సంవత్సరంలో తమ అంచనా మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాని అర్హులైన వ్యక్తులు మాత్రమే తమ పీఎఫ్ డబ్బుల నుంచి TDS కట్ చేయవద్దని అభ్యర్థించడానికి ఈ ఫారమ్ ఉపయోగపడుతుంది. పన్ను పరిధిలోకి వచ్చేవారికి ఇది వర్తించదు. అంతేకాకుండా, ఈ మినహాయింపు క్లెయిమ్ చేయడానికి ఇపిఎఫ్ఓ నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే పాన్ (PAN) కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి.